పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఎట్టెట్టూ మునిభార్య నన్ను వినదే యీమాట ని న్నాడఁగా
నట్టే కాక యెఱింగి వత్తము తదీయాహింసకత్వస్థితుల్
పట్టీ రమ్మని వెంటఁబెట్టుకొని భిల్లస్వామి దట్టంబుగా
నిట్టూర్పు ల్నిగుడంగ వచ్చి కనియెన్ వియ్యంపువాచంయమున్.

141


పృథ్వీ.

మతంగుఁడును జాతసంభ్రమముతోడ నర్ఘ్యాదిస
త్కృతు ల్సరవిఁ జేసి నాయెడకుఁ గీకటగ్రామణీ
వతంస చను దేరఁగా వలసె నేల నీకున్ సమీ
హితంబు వినిపింపు నా ఋషిమొగంబు వీక్షించుచున్.

142


క.

మనమున మఱియేయీహిత, మును లేదు భవన్నివాసమున నిర్జీవా
శనము భుజియింప వచ్చితి, నని ధర్మవ్యాధుఁ డాడ యతిసమ్మతుఁడై.

143


గీ.

కడురయంబున మాధ్యాహ్నికక్రియాక, లాపములు దీర్చి భుక్తిశాలావితర్ది
సీమమున నుండి వ్రీహిగోధూమయవల, నాయితం బయ్యె నాహార మని పిలిచిన.

144


సీ.

ఆవ్రీహిగోధూమయవ లెటువంటివి చూడంగ వలె నాకుఁ జూపుఁ డనిన
చేటలఁ ద్రవ్వి తెచ్చినఁ జూచి భిల్లవంశాగ్రణి హరిహరి యనుచు లేచి
పోవంగ వెనువెంటఁ బోయి యోయి మహాత్ముఁడా భుజింపకపోవుటకు నిమిత్త
మేమి నావుడు నమ్మహామునితో నసంఖ్యము లైనజీవుల ననుదినంబు
గనికరము లేక ప్రాణాలు గొని భుజించు, ఘాతుకునియింటఁ గుడువంగఁ గాదు గానఁ
దొలఁగిపోవుచు నున్నాఁడఁ గలిగెనేని, ప్రియమున భుజింతుఁ బెట్టు నిర్జీవభుక్తి.

145


సీ.

వనజీవి నొక్కటి ననువాసరము చంపి దాన నే నతిథులఁ దనిపి కొంత
శేషింపఁ బరిజనశ్రేణికి సంతృప్తి గావింతు నడుపుదు జీవనంబు
కటకటా యేఁట నొక్కటి సహస్రంబులై ఫలియించుజీవులఁ బ్రతిదినంబు
సంఖ్య మాలినవానిఁ జంపి పొట్టలు నిండ నాలుబిడ్డలు నీవు నారగింతు
పాతకుఁడ కాన నెంగిలిచేతఁ గాకి, నేయఁజాలవు తలఁప మదీయవర్త
నంబునకును భవద్వర్తనంబునకు, హస్తిమశకాంతరము సంశయంబు లేదు.

146


వ.

అది యట్లుండె నింక నొక్కవేదరహస్యంబు వినుము తొల్లి చతుర్ముఖుండు దైవ
భౌతపైత్రమానుషబ్రహ్మంబు లనుపంచమహాయజ్ఞంబుల బ్రాహ్మణహితార్థంబు నిర్మించె
నాయజ్ఞంబుల నితరవర్ణంబులవారు దారు చేయక బ్రాహ్మణులవలనం జేయింపవలయు
నిట్టిపంచమహాయజ్ఞంబులకొఱకు నోషధిపశులతలు సంపాదితంబు లయ్యెం గాని
కేవలంబు భక్షింపఁ గాదు దీని నెఱిఁగి వ్రీహిగోధూమపక్షిమృగాదిస్థావరజంగ
మాన్నంబులు యజ్ఞనిమిత్తంబు గావింతు మనిమిత్తంబు గావించినఁ బవిత్రంబులు గావు