పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

బిందియలఁ దెచ్చి జలముల, బృందావనమునకుఁ బోయుఁ బెంచినహరిణీ
బృందమునకు. ధేనువులకుఁ, దుండంబులు నిండ మేపు దూర్వాంకురముల్.

131


క.

ఈనియతిఁ గొంతకాలము, పో నొకదివసమునఁ గొంచెపుందప్పునకుం
గా నత్త ముగ్ధ నర్జున, కీనారిం జూచి పండ్లుగీటుచుఁ బలికెన్.

132


ఉ.

ఓసి దురాత్మురాల మృగయూధముల న్మొఱవెట్టఁగా మెడల్
కోసి వధించుపాతకునికూఁతుర బుద్ధులు చెప్పిచెప్పి నే
వేసరితిన్ మహాముని వివేకవిహీనుఁడు గాక యెట్టుగాఁ
జేసె నినుం బ్రసన్నునకు శిష్టవిధిజ్ఞత లేనిరక్కెసన్.

133


క.

పని లేదు నానివాసం, బున నుండఁగ నిఁకఁ బొకాలి పొమ్మని నునుఁజె
క్కున నెత్తు రుట్టిపడ వీ, డనిరోషావేశమున జటాలునఁ గొట్టెన్.

134


గీ.

ఇట్లు గొట్టినకొట్టున నెఱ్ఱవారి, పుష్పకోమలిధవళకపోలతలముఁ
గరుణ పుట్టించె రాహువు గఱచి విడువఁ, దొరుఁగు నెత్తురుతోడి చందురునిపగిది.

135


చ.

మఱియు బహుప్రకారముల మర్మము లెత్తుచు నత్త దిట్ట ని
వ్వెఱఁగున నాశ్రమస్థలము వెల్వడి సత్వరయానలీలఁ గ్రి
క్కిఱిసినచన్నుదోయి చలియింపఁగ వచ్చె దృగంబుపూరముల్
వఱదలు గట్ట నేడ్చుచు విలాసవతీమణి పుట్టినింటికిన్.

136


వ.

అప్పుడు భయసంభ్రమాశ్చర్యంబులు మానసంబున ముప్పిరిగొన ధర్మవ్యాధుఁడు
భార్యాసహితుండై బహిర్గేహదేహళిపర్యంతంబు చని వచ్చి తనపదంబులమీఁదం
బడి యేడ్చుకూఁతు నెత్తి గ్రుచ్చి కౌఁగిటం జేర్చి కరంబునం గన్నీరు దుడుచుచు
నూరార్చి లోనికిం దోడ్కొని పోయి నాతల్లి వల్లభావాసంబు విడిచి పురపురం
బొక్కుచు నొక్కతెవు నేమి కారణంబున నరుగుదెంచితి విట్లు దురవస్థం బొందు
టకు నుల్లంబు దల్లడిల్లెడుం జెప్పు మనిన నర్జునకి తండ్రి నాలోకించి.

137


క.

పిలిచెనఁట నన్ను నే వినఁ, బిలుచుట నీపాదమాన పిలిచిన నేలా
పలుక వనుచు నిప్పులు గనుఁ, గొలుకుల రాలంగ నత్త కోపముతోడన్.

138


ఉ.

ఓసి దురాత్మురాల మృగయూధములన్ మొఱవెట్టఁగా మెడల్ గోసి వధించుపాతకునికూఁతుర బుద్దులు చెప్పిచెప్పి నే
వేసరితిన్ మహాముని వివేకవిహీనుఁడు గాక యెట్టుగాఁ
జేసే నినుం బ్రసన్నునకు శిష్టవిధిజ్ఞత లేనిరక్కెసన్.

139


క.

అని కర్ణకఠోరము లా, డి నలుగురుం జూడఁ గట్టిఁడితనంబునఁ గొ
ట్టి నివాసంబున నుండక, చను మన వచ్చితి నటన్న సక్రోధుండై.

140