పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఎండకు నోర్వఁగఁ జాలక, కొండలు మొఱవెట్టె ననఁగఁ గోల్పులులు గుహా
మండలములనుండి మహా, తుండంబులు దెఱచి భాంకృతులు గావించెన్.

63


సీ.

జిలిబిలిమంచు కించిన్మాత్రమును లేక పంచబంగాళమై పాఱిపోవ
చల్లదనం బెల్లఁ బల్లవాధరలనిబ్బరపుబ్బుపాలిండ్లపంచ నొదుగ
నుదకంబు తెకతెక నుడుక మీఁదికి రాక మడుగులమానంబు లడుగు చేర
దశదిశాంతరములఁ దఱచుగా విస్ఫులింగములు గ్రక్కుచు వడగాలి సుడియ
నధ్వనీనులగుండియ లవియ వాఁడి, చూపె మల్లీలతావల్లరీపరాగ
ధూసరంబులు దప్తముక్తాసరములు, మాసరంబులు నైదాఘవాసరములు.

64


వ.

అట్టివాసరంబులు గలశుక్రమాసంబున శుక్లపక్షంబున నేకాదశీదినంబున హరిప్రీతి
గా నీవు నిర్జలోపవాసంబు చేసి నిజరాజధాని యైనజనస్థానపురంబున విష్ణుదేవా
లయంబున మహోత్సవంబు గావించి శ్రీమహాభాగవతాదిపురాణశ్రవణంబున నా
రాత్రి జాగరణంబు సల్పి మఱునాఁడు పూర్వపర్వతశిఖరభూమిసామిసముదిత
మిహిరకిరణకిసలయవ్రాతంబునకు బాలచూతం బైనప్రభాతంబునం గృతస్నానుండ
వై సాలంకారగవిసహస్రంబు మహీసుపర్వులకు దానం బిచ్చి పారణకుం బోవ సమ
కట్టి మణికుట్టిమస్థలంబున నడుగుపెట్టుసమయంబున నెట్టఁబడి నుదరశూలంబు
పుట్టి జగజెట్టివైద్యులచేత భేద్యంబు గాక మిగుల నుద్రేకించినఁ బ్రాణంబు కంఠ
కోణంబులఁ బెట్టుకొని కూర్మిరాణి యైన నారాయణిం గటాక్షించి హీనస్వరంబున.

65


క.

ఓనారాయణి నిన్నుం, బ్రాణముగాఁ జూచునాకు వఱ్ఱు దలఁచి పా
పానకు నొడిగట్టుకొనెం, గా నేఁడు విధాత యేది గతి యిఁక నీకున్.

66


మ.

అని ప్రాణానిలముల్ తొఱంగుతఱి భార్యానామధేయచ్ఛలం
బున నారాయణవర్ణముల్ తడవి తత్పుణ్యప్రభావోదయం
బున వైకుంఠపురప్రవేశమునకుం బోవంగ రోషించి ని
న్ను నిరోధింపఁగ బ్రహ్మహత్య నగు నేను న్వెంట నేతెంచితిన్.

67


వ.

అప్పుడు నిప్పులు రాలుకటాక్షంబున నన్ను వీక్షించి విష్ణుభక్తుని వెంబడించి యిది
యెక్కడిపిశాచంబు వచ్చె నని సంభ్రమంబున.

68


క.

పదములఁ బడి మొఱ వెట్టఁగ, నదయతఁ బెడకేలు గట్టి హరివీరభటుల్
చదియఁగ మోదిరి పెదపెద, గుదియలు గొని యెముక లెల్ల గుల్లలు గాఁగన్.

69


గీ.

మోదుటయు సూక్ష్మరూపినై మేదినీశ, తావకము లైనరోమరంధ్రముల నుంటిఁ
గాని వైకుంఠవిభునికింకరులచేత, నంత నొచ్చియు విడువ లే నైతి నిన్ను.

70