పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఆవేళ న్నినుఁ జూచి బాంధవచమూపామాత్యవర్గంబు చిం
తావైకల్యముతోడ భూపతికి మౌనం బేల వాటిల్లె నే
లా వాడె న్వదనంబు నేత్రముల నేలా తొట్టె బాష్పంబు లే
లా వైవర్ణ్యము దోఁచె దేహమున నేలా పుట్టె నిట్టూరుపుల్.

54


క.

అని సంశయింప బాంధవ, జనముల సేనాధిపతుల సచివులఁ జేస
న్ననె పొం డని శుద్ధాంతం, బునకుం జని బ్రహ్మహత్య మొగమున వ్రేలన్.

55


సీ.

ఉబుసుపోకకు నైన నొల్లవు చెవిఁజేర్ప వైణికవల్లకీవాదనములు
క్రేఁగంట నైన వీక్షింపవు శుద్ధాంతకామినీమణులశృంగారకళలు
పెనుబండువున వైనఁ బెట్ట నూల్కొనవు కట్టాణిముత్యంబులహారలతలు
కల నైన నునుమేన నలఁదవు పన్నీటఁ గలపిన కాశ్మీరకర్దమములు
మఱచి యైన విహారరమ్యస్థలంబు, చేర నరుగవు సుకృతలక్ష్మీవియోగ
వేదనాదూయమానమనోదురంత, చింతఁ జీకాకు పడి మహీకాంత నీవు.

56


వ.

ఇవ్విధంబున శరీరసౌఖ్యంబువలన వైముఖ్యంబును సకలసామ్రాజ్యోపకరణంబుల
వలన నిరాకరణంబును మృగయావినోదంబులవలన భేదంబును వహించి సహించి
నిలువరాని బ్రహ్మహత్యాపాతకంబు నివర్తింప విచారించి శ్రీహరిప్రీతిగా సువ్రతం
బులు సలుప నుద్యోగించునవసరంబున.

57


ఉ.

పిట్టలవాతు లెండ నలిబృందముపాట లవారి నిండ ని
ట్టట్టు చనంగ రాక ఫణు లాఁకట నుండఁ గభస్తిమచ్ఛిలా
పట్టికలన్ హుతాశనుఁడు బగ్గన మండ ధరిత్రిమీఁదఁ జూ
పట్టి రసాలసాలములు పండ నిదాఘము వచ్చె నుగ్రమై.

58


క.

ఆసమయంబున శైలగు, హాసీమల మండు వనహుతాశనము నృపా
లా సతతము నీహృదయములో సంతాపాగ్నివోలె లోలార్చులచేన్.

59


చ.

సమత సమస్తచిత్తముల సంతతమున్ విహరించుఁ గాన దై
వము మదనుండె తథ్య మని వంచన యించుక లేక యెండచేఁ
గమలపుటీకటాహములఁ గ్రాఁగెడు తేనియనూనెఁ దప్తమా
షము దొడికెన్ మదభ్రమరజాలము గేలిసరోవరంబులన్.

60


క.

పెనుగాలి చఱచి కొట్టిన, వినువీథికి నెగసి ధూళి విలసిల్లె మహీ
వనజేక్షణ తీవ్రతాప, మునకు వెఱచి పెట్టుకొన్న ముసుఁగునుబోలెన్.

61


గీ.

నీరనిధిరాజు కరుణించి నిష్ఠురాత, పంబుచే నొచ్చె నని భూతలంబు శీత
లంబు సేయంగఁ బలపినలహరు లనఁగఁ, నెండమావులు గనుపట్టె నెల్లకడల.

62