పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

తదవసరంబునం బరమతత్త్వము విష్ణు ననేకమూర్తిగా
హృదయములో నెఱుంగుకొనుమీ కను మీ వనినట్లు యోగసం
పదమహిమన్ విమానములపై శబరాగ్రణి పెక్కురూపులై
చదలఁ జరింప వానిఁ గని సమ్మదనీరధి నోలలాడుచున్.

27


క.

విష్టరక నిన్నుఁ బోలఁ ద్రి, విష్టపమున లేరు తత్త్వవిదు లని లబ్ధా
భీష్టత సంయమనమహా, ముష్టింపచపతి నివాసమునకుం జనియెన్.

28


సీ.

కావున నేతత్ప్రకారసుజ్ఞానంబు గలిగి స్వజాతీయకర్మతత్ప
రుం డైనవాఁడు ముక్తుం డని గీష్పతి బోధింపఁ దెలిసి రైభ్యుండు వసువు
నాత్మగేహములకు నరిగిరి నీవు నద్వైతమార్గంబున వాసుదేవు
సేవింపు మశ్వశిరోవసుధాధీశ కలుగు మోక్షం బని కపిలమౌని
చెప్ప నాతఁడు గడు సంతసిల్లి భూవ, ధూలలామకుఁ దనపుత్రు స్థూలశిరుని
భర్తఁగాఁ జేసి చనియెఁ దపస్విజనశ, రణ్యమునకును నైమిశారణ్యమునకు.

29


క.

చని తత్కాననమధ్యం, బున భూపాలుండు యజ్ఞమూర్తిస్తుతి య
జ్ఞనరున్ గురు నారాధిం, చెనని వరాహంబు చెప్పెఁ జెప్పిన మఱియున్.

30


గీ.

పృథివి యి ట్లను యజ్ఞమూర్తిస్తుతిప్ర, కార మానతి యిమ్మ భూదారవర్య
వినఁగవలె నన్న దేవుండు ఘనఘనాఘ, నార్భటీవిస్ఫుటోక్తి నిట్లని వచించె.

31


సీ.

బ్రహ్మరుద్రమహేంద్రపావకపవమానవిధువిభాకరముఖ్యవిబుధయాజ్య
శశిసూర్యనేత్ర భాస్వరదంష్ట్ర వత్సరాంకాయనకుక్షి దర్భాంగరోమ
యిధ్మసక్థి జగత్రయీదిశాభ్యంతరవ్యాప్తశరీర విశ్వప్రసూతి
సకలదేవాసురజయనిమిత్తానుయుగాంగీకృతైకనరావతార
యజ్ఞమూర్తి కుభృత్సన్నిభాంగ యీశ, యిజ్య పరమాణుతుల్య యోగీంద్రపూజ్య
హరి జనార్దన మూర్ధసహస్ర పరమ, వేదవేదాంగవేదాంతవేద్య నిత్య.

32


క.

ఈసకలము చతురాస్యుఁడ, వై సృజియింపుదువు చక్రివై కాతువు లీ
లాసంపన్నత రుద్రుఁడ, వై సమయింపుదువు నీవ యజ్ఞనరేంద్రా.

33


వ.

సంసారచక్రచంక్రమణక్రమణసంక్షయకాంక్షు లైనమహానుభావులకు సేవ్యుండవు
నీవ దేవా నీమానసంబున మానసంబును నీనేత్రంబుల నేత్రంబులు నీశరీరంబున
శరీరంబును సమర్పించినవాఁడ నన్యథా శరణంబు లేనివాఁడ నన్నుం గృతార్థునిం
జేయు మని యజ్ఞమూర్తిస్తోత్రంబునఁ బ్రార్థించినఁ బ్రసన్నుండై యజ్ఞనరుండు స
హస్రకరసహస్రదుస్సహమహామహోనివహంబై తనపురోభాగంబున వెలుంగ నందు
నశ్వశిరోనరేశ్వరుండు లయంబునం బొందె నని చెప్పిన వరాహస్వామికి భూమి
యి ట్లనియె.

34