పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

శిశువు మంట నెద్దుఁ జేయుచుఁ జెఱుచుచు, నాడునట్లపోలె నఖిలభూత
సృష్టిఁ దాన చేయుఁ జెఱుచు నప్పరమాత్మ, యిది నిజంబు సంశయింపవలదు.

19


గీ.

విశ్వ మాత్మప్రణీతమై వికృతిఁ బొందు, నందులోన నహంభావ మనుచితంబు
గా నెఱింగి వివేకులు మాని రనిన, విని మహాశ్చర్యమున సంయమనుఁడు పలికె.

20


క.

లుబ్ధక దూర్వాచర్వణ, లబ్ది నిజస్వాంతసమ్మిళత్పరమానం
దాబ్ధినిమజ్జన్మృగవధ, లుబ్ధుండవు నీకు నీపలుకులుం దగునే.

21


సీ.

అనిన లుబ్ధకుఁడు వీపున నున్న లోహపువల దెచ్చి ముందర వైచి దీని
లో వహ్ని దరికొల్పు నావుడు ధరణీనిలింపోత్తముండు మండింప లేక
దేశస్థ మయ్యు హుతాశి గన్నులవెంట వేర్వేర కీలలు వేయుఁ జూప
జాలంబు కాదంబగోళంబువలె నొప్పె నప్పుడు బోయ సంయమనుఁ జూచి
యోయి సంయమి వీనిలో నొక్కకీలఁ, గైకొనుము నీవు గ్రక్కునఁ గడమకీల
లార్పవలె నన్న నాతఁడు నట్ల చేయ, నీరు మిన్నంటుజ్వాలల నాఱఁ జల్లె.

22


గీ.

ఇవ్విధంబున వలలోనియింగలంబు, చల్లగా నార్చి కీకటస్వామి పలికె
ఋషికులోత్తమ యిఁక నాకు నిమ్ము నీవు, కైకొనినకీలఁ గఱకుట్లు కాల్పవలయు.

23


వ.

అనిన విని మునిశ్రేష్ఠుం డాయసానాయంబు డాయం బోయి తదంతరాళంబున
నిజగృహీతజ్వాలంబ యేల మొదలికి దహనలేశంబునుం గానక హీనకళాస్యంబు
తోడ నపహాస్యంబునకు నాస్పదంబై రిచ్చవడి వెచ్చ నూర్చినం గనుంగొని విష్టర
కుండు మహాత్మా హుతాశనుండు మూలనాశనంబునం బొందిన బహుముఖశిఖా
నికాయంబు మాయం బైనచందంబునఁ బరమాత్ముండు ప్రకృతిస్థితుం డైన భూతం
బులు సంక్షయీభూతంబులగు నతండు వికృతుం డైన వెండియుఁ బ్రభూతంబు
లగు నిది సకలప్రపంచస్థితి శరీరగ్రహణధర్మంబున నెవ్వనికి నెద్ది విహితం బక్క
ర్మంబు చేసి పరమాత్మునికి సమర్పించెనేని వాడు ఫలంబులం బొరయం డని
చెప్పె నప్పుడు.

24


క.

పరతత్త్వవిదుం డగువి, ష్టరకునిమస్తకముపై దిశాభాగములం
బరిమళము సోడు ముట్టఁగ, సురభూరుహపుష్పవృష్టి జోరునఁ గుఱిసెన్.

25


మానిని.

మాతరుణీపతి మన్ననఁ బంప విమానము లంబరమార్గ సమా
యాతము లయ్యె దదంతరసీమల నన్నిట యోగబలాతిశయ
ద్యోతకమూర్తులతో విహరించుచుఁ దోఁచెఁ గృపారసధూర్ధరుఁ డ
ద్వైతవివేకనిధానము చెంచు శతక్రతుముఖ్యులు దన్నుఁ గనన్.

26