పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అని వినుతింపఁ గన్యక లనన్యసమానభుజాపరాక్రమం
బున మహిషాసురాధిపచమూభటుల న్నఱకంగ నిల్చి న
నర్తనములు సల్పు మొండెములు వ్రాలినపుల్గుల నద్భుతంబుగాఁ
గన నికృతంబు లైనతలకాయలు క్రమ్మఱ వచ్చెనో యనన్.

97


క.

అఱిముఱిఁ గుమారికలు గొం, దఱు దానవభటులతలలు నరములతోడం
బెఱికిరి కరిణులు వెఱికెడు, తఱచుమృణాలములతోడితమ్ములఁ బోలెన్.

98


గీ.

కన్యకాకఠోరకరవాలధారలు, కంఠమూలములకుఁ గత్తరింప
రణధరిత్రిఁ ద్రెళ్ళి రాకాసితల లావ, రించె దీర్ఘనిద్ర ముంచుకొనఁగ.

99


చ.

తునిమిన వైరిమస్తములతో రుధిరార్ద్రములై విహాయసం
బున కెగయం గుమారికలమొత్తము వైచినశాతచక్రముల్
గనుఁగొన నొప్పెఁ బ్రస్ఫుటకళంకసమంచితమధ్యపూర్ణిమా
దినవిరమోదయత్తుహినదీధితిబింబవిడంబనాకృతిన్.

100


మ.

సమయజ్యోతిషికుండు వీరదనుజస్వర్యోషిదుద్వాహసం
భ్రమలగ్నంబు ఘటింపఁ బెట్టు గడియారం బి ట్లనన్ రక్తపూ
రమునం దేలెఁ గుమారికాకరధనుర్జ్యావల్లినిర్ముక్తశా
తముఖార్ధేందుశరక్షతంబు లగుతద్రక్షఃకపాలావళుల్.

101


క.

ఈరీతి నెదురు లేక కు, మారిక లుగ్రాహవమున మారిమసఁగుచో
బీరంబు విడిచి పాఱె సు, రారాతిబలంబు లెల్ల హాహా యనుచున్.

102


సీ.

అది కనుంగొని మహిషాసురుఁ డేమికారణమున మనపౌఁజు రణములోన
భగ్న మయ్యె నటంచుఁ బలుకఁ గుంజరదేహుఁ డైనయజ్ఞహరాఖ్యదానవుఁడు
దేవ యిప్పుడు కుమారీవిసరంబుచే విఱిగె నీపౌఁ జంచు విన్నవింప
నద్దిరా మదియించి రాడంగు లందఱిఁ జదియఁ గొట్టెద నంచు గద ధరించి
దేవగంధర్వకిన్నరసేవితాంఘ్రికమలయై మందరోపత్యకాస్థలమున
నిలిచి నిజకన్యకాకోటి గెలుపు చూచు, చున్నవైష్ణవిమీఁదికి నుఱికె నపుడు.

103


క.

ప్రఘనక్షోభణదుర్ముఖ, విఘనస్త్రీఘ్నాదిదైత్యవీరులు సంవ
ర్తగమనఘనాఘనఘోరా, పఘను లయోఘనధనుఃకృపాణీధరులై.

104


వ.

మిక్కిలి మొక్కలంబున దిక్కులు వగుల నార్చుచు నొక్కుమడిం గవిసినం గినిసి
తద్దేవి నిర్నిద్రరౌద్రరసోద్రేకంబునం బునఃపునర్నర్తితభృకుటిభీషణాభిరామయై
శరశరాసనడమరుముద్గరశతఘ్నీశూలకరవాలబిందివాలముసలముసుండిదండపుండరీ
కశక్తిపాశాంకుశధ్వజఘంటికాచక్రగదాకుంతభీకరంబు లయినవింశతికరంబులు ధరిం
చి విరించిప్రముఖనిఖిలదేవతావితానజయజయాలాపంబు లాదరించి సంచారించి