పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని చెప్పి నారదుండు సఫలమనోరథుండై గోళ్ళు నాకుచు నాకసంబున నదృ
శ్యుండై చనియె నిచ్చట మహిషాసురుండు నిజదూతకధితావమానభాషణశ్రవణ
జనితరోషదూషితస్వాంతుండై బలవంతంబున వైష్ణవిం బరిగ్రహింతు నని మందర
కందరాంతరప్రతిధ్వనదమందదుందుభిధణంధణధ్వానంబును సముద్ధురధ్వజినీ
ముఖధావద్ధయఖురస్ఫురద్ధరోద్ధూతధూళీసమూహవలాహకవలాకాయమానబిరుదకే
తనంబును రంగదుత్తుంగమతంగజఘటాభారభంగురభుజంగపుంగవఫణోత్సంగవిలో
కనవ్యాకులభోగిభీరుహాహాకారపూరితరసాతలంబునుం గా నుద్దవిడి నేతెంచుకోలా
హలం బాలకించి కించిదంకురితభ్రూభంగభీషణపాలభాగ యగునమ్మహాభాగచిత్తం
బెఱిఁగి రింగులు వాఱఁ గట్టినపట్టుపుట్టంబులు మాని మానితమణిమయార్థోరుకం
బులు ధరియించి యొడ్డాణంబులు బిగియించి మంచిక్రొమ్మించుమించువలిపకంచె
లలు మాని వజ్రకవచంబులు దొడిగి పులుకడిగినముత్తియంపుంబాపటలతోడిపిల్ల
కొప్పులు మాని జడచొళ్ళెంబులు వైచి కళాచికాచమరవాలతాలవృంతాదికంబులు
మాని వివిధాయుధంబులు పూని శాలీనకోకిలాలాపంబులు మాని దానవాసహ్య
సింహనాదంబులు సేయుచు శరన్నదులు వర్షానదు లైనకరణి మందానిలంబులు
ఝంఝానిలంబు లైనచందంబున మెఱుంగులు పిడుగు లైనతెఱంగున శృంగారమనో
హారిశరీర లైనకుమారికలు దారుణాకారలై నిజాంగరోమకూపంబులం దమవంటి
వారి ననేకకోటికుమారికలం బుట్టించుచు నిలింపరిపుసైన్యపరంపరలమీఁదం గవిసి
బారి సమరునప్పుడు వియచ్చరు లచ్చెరుపడి యీకుమారికలు కలికికన్నులచెలువం
బునన కాదు జవంబున హరిణంబుల గెలిచిరి గాని యన గొంటరిదైత్యుల నంటం
దఱుముచు నీకన్నియ లన్నువనడుములసన్నదనంబునన కాదు పరాక్రమంబు
లను హరికిశోరంబుల గెలిచిరి గాని యనఁ బ్రఖరనఖరంబుల రక్కసుల వ్రక్కలిం
చుచు నియ్యిందుముఖులు మందగమనంబునందంబునన కాదు సత్వంబునను మత్త
గజంబుల గెలిచిరి గాని యన దానవులం బట్టి చట్టలు చీరుచు నీలేమలు రోమరేఖ
లన కాదు క్రౌర్యంబునను గాలసర్పంబుల గెలిచిరి గాని యన దేవారిజీవానిలం
బులు గ్రోలుచు నెదురు లేక రణవిహారంబు సలిపెద రని ప్రశంసించి మఱియును.

95


సీ.

ఉయ్యాల లూఁగుచో డయ్యులతాంగు లీపగిది వాహనములఁ బఱపు టెట్లు
చిలుకల ముద్దాడ నలయుబింబోష్ఠు లీరీతి శంఖములు పూరించు టెట్లు
సరసయానముల వేసరుఘనశ్రోణు లీఠేవ దైత్యుల వెన్నడించు టెట్లు
నునునవ్వు నవ్వ నోపనిమృదుస్వన లిటువలె నట్టహాసము ల్సలుపు టెట్లు
నెమ్మొగంబులతావికిఁ గ్రమ్ముతేఁటి, మూఁక లీలాబ్జములఁ జోప లేక బడలు
బాలపల్లవహస్త లీభంగి పాఁడి, పట్టెసముల విమతసేనఁ గొట్టు టెట్లు.

96