పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

క్రోలి గర్భంబు వహియించి కొడుకుఁ గాంచి, యెనుపమేను దొఱంగె మాహిష్మతీకు
మారి యీరీతిఁ బుట్టినమహిషదైత్య, వల్లభుఁడు బ్రహ్మవంశవివర్ధనుండు.

84


చ.

హరిహయముఖ్యదిక్పతుల నందఱ వెంపరలాడి వారలం
బురములు వెళ్ళఁ ద్రోలి కలమూలధనంబులు కొల్లవెట్టి ని
ర్భరభుజవిక్రమస్ఫురణ రాజ్యము చేయుచు నెప్పుడున్ భవ
చ్చరణసరోజసేవనలు సల్పఁ దలంచుచు నుండుఁ గావునన్.

85


క.

మానిని యద్దానవపతి, ప్రాణేశ్వరి వగుచుఁ గాపురము చేసితివే
నానాభువనంబుల నీ, కానయు సుకరంబు చెల్లు నని పలుకుటయున్.

86


క.

పకపక నగె నవ్వైష్ణవి, వికచాననగహ్వరమున వివిధాజాండ
ప్రకరంబులు విచ్చిన శు, క్తికలో ముక్తాఫలములక్రియఁ గానఁబడన్.

87


గీ.

అట్టిమహిమఁ జూచి యాశ్చర్యభయసంభ్ర, మముల మూర్ఛఁ బొంది మహిషదూత
తెప్పిఱి వినఁ బల్కె దేవిచిత్త మెఱింగి, విజయ యనెడు పేరివేత్రహస్త.

88


క.

ఏమును నీజగదంబయుఁ గౌమారవ్రతల మిం దొకరిఁ బురుషులకున్
గామింప రాదు దానవుఁ, డా మదమున మమ్ము నడుగ నర్హుం డనినన్.

89


క.

ఈమాటకు నెదురుత్తర, మే మైనను నియ్యవలయు నే నని తలఁపం
గా మహిషదూతఁ జూచి జ, యామానిని రోషకంపితాధర యగుచున్.

90


క.

ఓరి దురాత్మక కౌమా, రారామలతోడ నీవరచుపల్లరుపుల్
సైరించితి మిఁక నూరక, నో రెత్తితి వేని మిగుల నొత్తువు సుమ్మీ.

91


మ.

అని భర్జించినఁ బుల్లసిల్లి విముఖుండై పోయె విద్యుత్ప్రభా
ఖ్యనిశాటాధముఁ డంత నారదుఁడు గయ్యం బింతటం గల్గెఁ బోఁ
గనుఁగో నా కనుచున్ సుమాళమునఁ జంకల్ వేసికొంచున్ వడిన్
వినువీథిం జనుదెంచి మ్రొక్కి నిలిచెన్ విశ్వేశ్వరీసన్నిధిన్.

92


చ.

నిలిచినఁ జూచి వైష్ణవమునీ వదనంబు చెమర్ప నిట్లు రాఁ
గలిగినకార్య మే మనుచు గండతలంబున లేఁతనవ్వుని
గ్గులు మెలవంగఁ బల్క సురకోటులు సంగరమండలంబులో
పల మహిషాఖ్యుచే విఱిగి పాఱి విరించికిఁ జెప్ప నాతఁడున్.

93


శా.

ఓసర్వేశ్వరి దృప్తుఁడై మహిషదైత్యుం డష్టదిక్పాలసే
నాసందోహముఁ దోలి నిన్నుఁ జెనకన్ సన్నద్ధుఁడై వచ్చె మా
కా సామర్థ్యము లేదు వాని గెలువంగా నీవె దిక్కంచు నా
చే సర్వంబును విన్నవించి పనిచెం జేకొమ్ము తత్ప్రార్థనల్.

94