పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

వరాహపురాణము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీవేంకటాద్రిపతిసం, సేవాహేవాకనిపుణ శేషాహిఫణా
ళీవినమనకరకరిసే, నావిభ్రమ యీశ్వరేంద్రునరసింహనృపా.

1


వ.

అవధరింపు మవ్వరాహదేవుండు ధాత్రి కిట్లనియె.

2


గీ.

అట్లు దన్ను మహీకాంతుఁ డడుగఁ దపసి, పలికె నరపాల మున్ను గీష్పతి నడిగిరి
బ్రహ్మసుతుఁ డైనరైభ్యుండు రాజవర్యుఁ, డైనవసువును నీవు న న్నడిగినట్ల.

3


సీ.

అది విను చాక్షుషం బైనమన్వంతరంబున బ్రహ్మవంశవర్ధనుఁడు వసువు
నృపరత్న మొకనాఁడు నీరజాసనుఁ గొల్వ నేగుచోఁ దెరువున నెదురుపడ్డ
సకలవిద్యాధరస్వామి చైత్రరథుండు విబుధవర్గంబు సేవింప నలువ
గొలు వయి యున్నాఁడు గొబ్బునఁ బొ మ్మని చెప్ప హుటాహుటిఁ జేర నరిగి
నిలిచె మూపును మూపును దొలఁగఁ ద్రోవ, రానిసందడి గని పద్మరాగరత్న
ఖచితహాటకమయకుంభరుచిపరంప, రానిరాఘాట మగుహజారంబుకడకు.

4


క.

ఆసమయంబున రైభ్యమహాసంయమి యేగుదేర నర్ఘ్యాదివిధుల్
చేసి వసునృపతి యెటు వి, చ్చేసెదవు మునీంద్ర నాకుఁ జెప్పు మటన్నన్.

5


క.

అనిమిషగురుండు చతురా, నను సేవింపంగ వచ్చినాఁ డని విని యేఁ
బనివడి చనుదెంచితి నా, తని నొకసందేహ మడుగఁ దలఁచి నృపాలా.

6


క.

అని రైభ్యుఁడు వసునరపా, లునకుం జెప్పంగ నంతలో నంబురహా
సనుఁ డనిపినఁ దమతమకే, తనములుఁ గరితురగరథపదాతులు మెఱయన్.

7


సీ.

నడిచె నింద్రుండు కిన్నరకాహళులు మ్రోయ గమనించె శిఖి డిండిమములు మ్రోయఁ
జనియె దండధరుండు జయదుందుభులు మ్రోయ వెళ్ళె దైత్యుఁడు గిడిగిళ్లు మ్రోయఁ
బోయె నంబుధిరాజు బూరగొమ్ములు మ్రోయ జరగె నాయువు మురజములు మ్రోయ
నరిగె యక్షుండు కిన్నెరవీణియలు మ్రోయఁ గదలె రుద్రుండు శంఖములు మ్రోయ