పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

దంభోళిసంరంభకుంభినీధరభేది యవిగర్హితవిజృంభణార్హబర్హి
దావపావకమహాప్రావిణ్యశమనంబు బర్బరవార్వాహకర్బురంబు
దుర్ధరవాహినీవర్ధిష్ణువార్ధిపం బారావఘోరసమీరణంబు
ప్రోద్యదుద్దామవిద్యుద్విభాసిశ్రీద మూర్జితగర్జితానార్జవోగ్ర
మైనదైవతసైన్యఘనాఘనంబు, గురియు శరవర్ష మొక్కింత సరకుగొనక
మోరత్రోపుఁదనంబున మోఱకించి, తాఁకె నెనుపోతురాకాసి నాకవిభుని.

64


వ.

మఱియు నంజనుండు నీలకుక్షి మేఘువర్ణుండు వలాహకుండు లలాటాక్షుండు ప్రభీ
ముండు తారాక్షుండు స్వర్భానుండు ననుదనుజు లెనమండ్రు వసువుల నసువులు
తోన పట్టెద మని చుట్టుముట్టిరి స్తబ్ధకర్ణుండు శంకుకర్ణుండు రక్తాక్షుండు భీమా
క్షుండు విద్యున్మాలి విద్యుజ్జిహ్వుండు కృతాంతుండు వజ్రకాయుండు మహాకా
యుం డతికాయుండు దీర్ఘకాయుండు భీమదంష్ట్రుండు ననుమనుజాశనులు పన్నిద్ద
ఱాదిత్యుల మృత్యువశులం జేసెద మని రేసి వేయేసినిశితాశుగంబు లేసిరి కాలుండు
కృతాంతుండు రక్తాక్షుండు క్షోభణుండు మిత్రహుండు యజ్ఞహుండు బ్రహ్మ
హుండు గోఘ్నుండు స్త్రీమ్నుండు సంవర్తకుం డనిలుం డను పెనురక్కసులు
పదునొక్కండ్రు రుద్రుల నుక్కడంతు మని యెక్కిరి తక్కినదైత్యు లొక్కొక్క
వేల్పు నొక్కరుండు చిక్కించుకొనిరి యిక్కరణి నెక్క టెక్కటిం బోరుసురా
సురసైన్యసమూహమ్మున ముమ్మరమ్ముగా సకలకకుమ్ముఖమ్ములం గ్రమ్ముపెనుదుమ్ములో
నెడనెడం బొడముమిడుంగుఱులు ఘోరాంధకారవిద్యోతమానఖద్యోతకీటంబు
లం బోల ఖడ్గాఖడ్గి నఱుకులాడువారును సందష్టాధరోష్ఠులై ముష్టాముష్టి గ్రుద్దు
లాడి మూర్ఛ పెల్లున రక్తప్రవాహంబున గుభుల్లునం ద్రెళ్ళునప్పుడు దాశరథిబధ్య
మానమహాశరధిమధ్యపాతితగిరిపరంపర ననుకరించువారును విలయసమయఝం
ఝాఝంపాసంపాతకంపనసమావేల్లితశాఖంబులై వేళ్ళతోన పెల్లగిల్లుసముత్తాల
సాలంబులపోలిక బాహాబాహిం బెనంగి మ్రొగ్గుచు నేల వ్రాలువారును శరాశరీ
సమరజనితోరువివరనికరపతితశరీరులై సోలి భైరవస్వర్ణకారుండు కల ననుకమ
టంబునికటంబునఁ బెట్టినకమ్మచ్చులయచ్చునం గనుపట్టువారును నైరి తదవస
రంబున సుర ససురవిసరశరనికాయజర్జరీతకాయులై విఱిగి పంతంబుల సంతఁ బెట్టి
బిరుదులు వదలి కడిమి విడిచి వాసి పెడఁబాసి మానంబు మాని గుట్టు గట్టిపెట్టి
ప్రాణరక్షణపరాయణత్వంబునం గకపికలై పఱచి మొఱవెట్టుచు బ్రహ్మకడకుం
జని తమదురవస్థ విన్నవించి రటమున్న మహిషాసురుండు పంపినదూత విద్యుత్ప్ర
భుం డనువాఁడు మందరగిరి కరిగి తదీయశిఖరోపరిగతమహానగరమధ్యవిభాసమాన