పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మెఱయఁ గోట్లకొలఁదు లుద్భవించి తేఁటిమొత్తమ్ములతమ్ము లగుకురులు కలువల
వలపించుకలికిచూపులు పులుకడిగినముత్యంబులతోడి పవడంబులడంబు లడంచు
దరహసితలసితాధరంబులు ధరమ్ములగౌరవమ్ము వమ్ము చేయువలిగుబ్బలు బలుజోడు
మరునికోదండంబు దండంబు లిడునడుములును ములుబంతులపరుసునం బరుస
నగుకరికరంబులకు నౌన్నత్యప్రసిద్ధి సిద్ధించిన నిజజఘనభాగములు గములు గూడి
వచ్చినం గదలి కదలికలకలహము సరకుఁగొననిమనోహరోరుస్తంభంబులు భం
బులు చూపురుచులు చులుకం జేయుపాదనఖంబులుం దనర మత్తిల్లి విరహుల
మొత్తములం దుత్తుమురుగా మొత్తుచిత్తజునికత్తి హత్తిననెత్తురులతోడం బొత్తెత్తు
చేయు మెత్తనిచరణంబులక్రొత్తలత్తుకల మందమందగమనంబునందంబు నందంద
పొగడువందిబృందంబుచందంబునం గ్రందుకొన మొరయునందియల దట్టంబు
గాఁ బొడుపుగట్టుమిట్టలపట్టులం బట్టినబాలాతపధట్టంబుచుట్టంబు లై చూపట్ట
నెరివట్టి గట్టిపిఱుందులం గట్టినకెంబట్టుపుట్టంబుల శంబరారి యనుదొంబరి
విడంబంబునం దూర నంబరంబునం బన్నినవలయంబు లనం బొలుచునవలగ్నం
బుల విలగ్నంబు లగునొడ్డియాణంబుల శృంగారతరంగరంగంబు లగుయౌవనవన
సముత్తుంగకుడుంగంబులతెఱంగున రంగుమీఱు మెఱుంగుఁజనుంగవలం గిసలయ
భృంగసంగతప్రసవభంగి నంగీకరించునీలమాణిక్యమిళితమౌక్తికహారంబుల నిచ్చ
లంపువలపుల మచ్చుచల్లి విచ్చలవిడి నిచ్చలు నిచ్చరాచరంబు మోసపుచ్చుపచ్చ
విలుతుని మెచ్చులవల్లెత్రాళ్ళ నచ్చట నచ్చటం గ్రుచ్చినపలువన్నెకుచ్చులయ
చ్చున హెచ్చుకరమణికేయూరకంకణాంగుళీయకంబుల వెక్కసపుటక్కజంపుఁ
దెలుపునం జుక్కలఱేని నెక్కసక్కెమాడి తళుక్కుతళుక్కు మనుచు నొక్కటఁ
బిక్కటిలువజ్రకుండలరుచులపెక్కువతో మక్కువ సలుపుమిక్కిలిచక్కనిచె
క్కులకాంతిలహరికలోనిమకరికలవిప్పు గలనాచుకుప్పలనడిమి పగడంపుఁదీఁగెలచొ
ప్పుం దప్పునట్టికప్పులఁ దెప్పు లగుకొప్పుల నొప్పుచందిరంపుఁబాపటలప్రభాపటలం
బు లినుమడించుదేహంబుల విలసిల్లుచు నలుగడల సేవించి నిలిచినం జూచి రజో
గుణప్రధానయు నపరాభిధానయు నగుతన్నారాయణి యీకుమారికాసహస్రంబు
లకు నాకునుం దగిననగరంబు గల్పింతు నని సంకల్పించినఁ దత్ప్రభావంబున.

29


సీ.

పరిఘావలోకనప్రాప్తాపరాంబుధిభ్రమపతిష్ణుబ్రధ్నరథహయంబు
నిక్షిప్తమణిమిళన్నక్షత్రమండలధ్యాసితవప్రమధ్యస్థలంబు
సౌధవీథీమహోత్సేధవీక్షోద్గ్రీవమైరవశిఖరగామరపురంధ్రి
త్రైవిక్రమాంఘ్రినిర్దళదజాండస్రుతావరణాంబువిభ్రమధ్వజపటంబు