పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మౌనిపుంగవులారా యింక నానాగిరిప్రదేశంబులం బ్రకాశించుదేవతావకాశం
బులు వర్ణించెద నాకర్ణింపుఁడు సంతతవిహరమాణఖచరకాంతాపరివృతం బగు
సితాంతం బనుపర్వతంబున మహేంద్రవిహారధామం బైనపారిజాతారామాభి
రామం బగునక్కొండదండనుండుకుంజరం బనుశైలంబుమీఁద దానవపురంబు లెని
మిది గానంబడు వజ్రాంకం బనుపర్వతంబునఁ గామరూపు లైననీలకు లనురక్క
సులపురంబులు పెక్కులు గలవు మహానీలం బనుశైలంబున హయముఖనగరంబులు
పదేనుఁ గిన్నరనగరంబులు పదేనునుం గల వప్పురంబులు సౌవర్ణంబులు సబిలప్రవేశం
బులునై విలసిల్లు నందులకు దేవదత్తచంద్రాదులు రాజులు చంద్రోదయం బను
పర్వతంబున ననేకగణభూతకోటీసహస్రపరివారుం డగుమహాదేవుండు పరమయోగి
పుంగవులు సేవింప ననవరతంబును విహరించుచుండు వసుధారం బనువసుధాధరం
బున వసువులపురంబు లెనిమిది గొనియాడం దగు రత్నధారం బనుకుధరంబున
సప్తర్షిపురంబు లేడు చూడ నొప్పు నేకశృంగపర్వతంబునం జతుర్ముఖబ్రహ్మ వసి
యించు గజపర్వతంబున మహాభూతపరివృత యైనయాదిశక్తి యనురక్తి విహరించు
చుండు నాదిత్యవసురుద్రులకుం బొత్తులయిర వైనవసుధారం బనుగిరివరంబున
మహాప్రాకారతోరణంబు లైనదివ్యపురంబు లెనుబది గల వందు సభ్యవర్తననామ
ధేయులు నాయోధనసగర్వులు నైనగంధర్వు లధివసింతురు వారలకు రాజు రాజ
రాజు సునగంబున రాక్షసులకుఁ బంచకూటంబున దానవులకు శతశృంగంబున యక్షు
లకుఁ దామ్రాభంబున దక్షునకుఁ బురంబులు నూఱేసి గలవు విశాలంబున గుహ్య
కులును శ్వేతోదయంబున గరుడపుత్రుం డగుసునాభుండును హరికూటంబున హరి
యును గుముదంబునఁ గిన్నరులును నంజనంబున మహోరగులు నుందురు కృష్ణంబున
గంధర్వవిద్యాధరులపట్టణంబులు పదేడు గలవు సహస్రశిఖరంబున నుగ్రకర్ము లైన
దైత్యులు వసియింపుదురు హేమమాలియందు దివ్యపురసహస్రం బజస్రంబును
వెలుంగు నివి మొదలైనవి శేషంబు లన్నియును మేరువుమీఁదివకా నెఱుంగుఁడు
మఱియును.

138


గీ.

దేవఋషిచరితయుతమౌ దేవకూట, మనెడు పొలిమేరగుబ్బలియందు నూఱు
యోజనంబులు గరుడునియునికిపట్టు, రత్నరుచి నొప్పు దానిపార్శ్వంబునందు.

139


క.

బలవంతు లైనయాజ్ఞే, యు లనెడుగంధర్వవీరు లుండెడు పురముల్
గల వేడు నిడుపు వెడలుపు, నలువది ముప్పదియుయోజనము లందులకున్.

140


క.

ఉండుం ద్రింశద్యోజన, మండలమై సింహికాకుమారులపుర మ
క్కొండదఱిఁ గాలకేయులు, నుండుదురు సుధామ మనెడునొకపురమందున్.

141