పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధర్వంబు సలుప గంధర్వులు విహరింతురు సమూలవసుధారధరాధరమధ్యంబున
ముప్పదియోజనంబులు వెడలుపు నేఁబదియోజనంబులనిడుపునుం గలబిల్వవనంబు
మెఱయు నందు నున్నమద్రుమవిద్రుమమద్యుతిఫలద్రుమంబుల జొత్తిల్లినమృత్తిక
పదతలంబులం గ్రొత్తలత్తుకతెఱంగున హత్తుకొన సంచరించుగుహ్యకమత్తకాశినుల
మొత్తంబులు మగలచిత్తంబులు మదనరసాయత్తంబులు చేయు వసుధారరత్న
ధారవసుధాధరంబులనడుమ ముప్పదియోజనంబులవెడల్పు నూఱుయోజనంబుల
నిడుపునుం గలిగి సతతవికసితకుసుమసౌరభంబు శతయోజనంబుల సోడుముట్ట
సిద్ధాద్యుషితజలాశయంబులు గనుపట్ట నుండుకింశుకవనంబునం బ్రతిమాసంబును
వాసరేశ్వరుం డవతరింప నిలింపకింపురుషాదులు సేవింపుదురు పంచకూటకైలాస
శైలంబులనడుమ సహస్రయోజనాయామంబును శతయోజనవిస్తారంబును హంస
పాండురంబు నైనభూమండలంబు గలదు కపిలశిఖశిఖరమధ్యంబున నూఱుయోజ
నంబుల వెడలుపు నిడుపునుం గలహేమశిలాతలంబున నడుమ వింశతియోజన
విస్తీర్ణంబును శతయోజనాయతంబు నగువహ్నిస్థానంబున సకలలోకక్షయకారి
యగుసంవర్తకజ్వలనుండు నిరంతరంబు నింధనంబు లేకయు వెలుంగుచుండు
వెండియు.

132


క.

ఘనమాతులుంగవన మం, జనకుముదాద్రులకునడిమిచక్కిన్ దశయో
జనమితము జంత్వగమ్యము, ననిశము సురగురున కిరవు నై విలసిల్లున్.

133


సీ.

సురసపింజరనగాంతరమున బహుశతయోజనాయతము నీరేజకుముద
సందోహమకరందనందదిందిందిరశ్రేణియు నగుసరోద్రోణినడుమఁ
గలదు యోజనపంచకప్రమాణం బైనవటవృక్ష మొకటి తద్వటముక్రింద
చంద్రవర్ణుఁడు సహస్రముఖుండు నీలవాసుండు నై వాసుదేవుండు నిలుచు
కుముద సాహస్రశిఖరమధ్యమున నేఁబ, దియును ముప్పదియోజనా లయిననిడుపు
వెడలుపును నైనయొకదివ్యవృక్షవాట, మమరు నింద్రుని కాశ్రయం బగుచు నెపుడు.

134


క.

వెలయుఁ బెనుబైలు నిషధా, చలకూటమునందు నడుదెసన్ సురభిశ్రీ
ఫలనిభకాకోలములన్, నలపుష్కరసోమదత్తనాగాస్పదమై.

135


గీ.

నాగశైలకపింజరాంతరములందు, మీఱుఁ జదరపునేల యిన్నూఱుయోజ
నములనిడుపున శతయోజనములవిరివి, ఫలితఖర్జూరగోస్తనీలలిత మగుచు.

136


మ.

అఱచేయిం బలె మేఘపుష్కరమహాహార్యాంతరాళంబునం
దఱవైయోజనముల్ వెడల్పును శతాయామంబునుం గల్గి య
త్తఱి వీరుత్తరుశూన్య మైనబయ లందం బొందు న న్నేలకుం
దఱచై నల్గడలం గొలంకులునుఁ గాన ల్మించుఁ జిత్రంబుగన్.

137