పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విభుండు యక్షవిభుం డధ్యక్షించు నెనిమిదవదిక్కున మూర్తాపవర్గంబు స్వర్గం
బీశానుఁడు శాసించు యిది మేరుకర్ణికామూలప్రకారంబు.

114


క.

హరిదష్టపర్వముల నం, బరచుంబిశిఖరము లైనమర్యాదాభూ
ధరరాజము లెనిమిది గల, వరయం దదాధారమునఁ గదా మహి నిలుచున్.

115


గీ.

మందరము తూరుపున గంధమాదనంబు, దక్షిణంబున విపులభూధరము పశ్చి
మమునను సుపార్శ్వగిరి యుత్తరమున నుండు, శాతకుంభాద్రి కిట్టివిష్కంభగిరులు.

116


క.

శృంగములు నాల్గుతరువులు, భృంగశుకములువలె దైత్యబృందారకు లు
త్తుంగకుసుమఫలవాంఛా, సంగతిఁ దముఁ గొలువ మెఱయు సర్వర్తువులన్.

117


మ.

తరిగొండన్ గలశప్రమాణకుసుమోద్యద్గంధముల్ భూనభోం
తరసీమంబున వేయియోజనములన్ దాటంగ భద్రాశ్వవ
ర్షరమాకేతనమై కదంబధరణీజం బొప్పు నాచెట్టుచ
క్కి రమించున్ హరి సర్వకాలము హయగ్రీవావతారంబునన్.

118


సీ.

గంధమాదనమునఁ గల దల్లొనేరేడు దంతులయంత లందలిఫలములు
పక్వంబులై రాలి పగులఁ దద్రసమున జంబూతరంగిణి సంభవించె
నాయేటిసలిలంబు లమృతపూరముకంటెఁ జవి యని క్రోలు నిర్జరగణంబు
లచట జాఁబూనదం బనుపైఁడిఁ జేసినతొడవులు ధరియింపుదురు దివిజులు
భారతాహ్వయవర్షశృంగార మగుచుఁ, బ్రబలి సర్వర్తుఫలపుష్పభరిత మైన
దానిమహిమంబు వర్ణింపఁ దరమె పేరు, కలిగె నీదీవి కాచెట్టుకతనఁ గాదె.

119


చ.

విపులధరాధరాగ్రమున వేలుపుమూఁకలరచ్చరావి ది
వ్యపరిమళంబుతోఁ గడవలంతలు పండుల విఱ్ఱవీఁగు నా
కిపతి పయోధి ద్రచ్చునెడఁ గేతువుపై మణిమాల చేర్పఁ బే
రు పడియెఁ గేతుమాల మన రూ పగువర్షము దానిపేరిటన్.

120


సీ.

వినుఁడు సుపార్శ్వపృథ్వీధరంబున మధుస్రావివిశాలపత్రములతోడ
శతయోజనాయతశాఖాశిఖాలంబమానప్రసూనదామములతోడ
నమృతసంపూర్ణవిద్రుమకుంభపరిమాణపరిపక్వఫలపరంపరలతోడ
గంధర్వసురబాలికాడోలికాకేలికారణఘనశిఫాగ్రములతోడఁ
జాలఁ గనుపట్టు నొకవటక్ష్మారుహంబు, నలువ మానససుతులు సనత్కుమారు
లనుజు లేడ్వురు కురుసంజ్ఞు లందు నిలువఁ, గలిగె నుత్తరకురుదేశములకుఁ బేరు.

121


వ.

ఇది విష్కంభవర్తనం బింక మందరగంధమాదనవిపులసుపార్శ్వపర్వతప్రాంతంబు
లం గలవనంబుల వనంబులలోనిసరోవరంబులు సరోవరంబుల దరులం గలగిరుల