పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రముఖుఁడై విష్ణునామముఁ గలమామకాంశజుఁడు పండ్రెండవచండభానుఁ
డవనిపై నుదయించు నతని నీవు భజింపు మేనును నిను భజియింతు ననుచుఁ
బలికి నారాయణుండు తజ్జలములోన, లీనుఁడై యుండె నాతండు లేనిచోటు
లేదు తద్దేవుసరి వేల్పు లేదు వేఱు, లేదు నాకును నతనికి లేశ మైన.

94


ఉ.

వేదపురాణసార మిది వింధ్యజిదాదిమునీంద్రులార సం
వాదము మాని యజ్ఞమున వారిజనాభుని కగ్రపూజ లిం
డీదివిజాలికిన్ మునుల కీసనకాదికయోగికోటికిన్
గా దన రాదు సమ్మతము గావున నాపలు కెల్లవారికిన్.

95


క.

అని పలికిన రుద్రుని శంభుని శాశ్వతు నజుని విశ్వమూర్తి లలాటా
క్షుని శూలపాణిఁ బొగడుచు, మునులు నుతులు చేసి వినయముకుళితకరు లై.

96


శా.

దేవా దేవరదివ్యవాక్యములచేఁ దీఱెన్ మహాసంశయం
బీవాత్సల్యము మాపయి న్నిలిపి సర్వేలాప్రమాణంబుఁ బా
రావారాద్రినదీవనస్థితులు నీబ్రహ్మాండవిస్తారముం
బ్రావీణ్యంబున నానతి మ్మనిన నారాజార్ధకోటీరుఁడున్.

97


వ.

నారాయణస్మరణదూరీభవత్తములార తాపసోత్తములార బ్రహ్మవిష్ణువాయుపురా
ణంబుల నతివిస్తృతం బగునీభూగోళప్రపంచంబు గొంచెంబున వినిపించెద మున్ను
సకలవేదవేద్యుండు నాద్యంతరహితుండు నప్రమేయుండు నగు నారాయణుండు
యోగనిద్రాసుఖం బవధరింప నద్దేవునాభీసరోవరంబున విమలం బగు నొక్క
కమలంబు మొలచె నందు నల్పేతరప్రపంచకల్పనాశిల్పి యగువిరించి సంభవించి
మొదల సనకసనందనసనత్కుమారాదిపరమయోగివరులు నిర్మించి వెనుక స్వాయం
భువుం డనుమనువును మరీచ్యాదిదక్షాంతంబుగా నవబ్రహ్మలను సృజియించె స్వా
యంభువమనువు ప్రియవ్రతోత్తానపాదు లనుతనయుల నిద్దఱిం గనియె తత్త్రియ
వ్రతుం డగ్నిధ్రు మేధాతిథి జ్యోతిష్మంతు ద్యుతిమంతు వపుష్మంతు హవ్యు సవనుం
గని వారిలో నగ్నిధ్రు జంబూద్వీపంబున మేధాతిథి శాకద్వీపంబున జ్యోతిష్మంతుఁ
గుశద్వీపంబున ద్యుతిమంతుఁ గ్రౌంచద్వీపంబున వపుష్మంతు శాల్మలిద్వీపం
బున హవ్యు గోమేధద్వీపంబున సవనుఁ బుష్కరద్వీపంబునఁ బట్టంబు గట్టె నా
సవనునకుం గుముదధాతకు లనుకుమారులు మహావీరు లిద్దఱు జనియించి నిజనామం
బుల ధాతకీషండకౌముదపండంబు లనుదేశంబులు రెండు గోమేధద్వీపంబునఁ
గల్పించుకొనిరి శాల్మలాధిపతి యగువపుష్మంతునకుఁ గుశలవిద్యుతిజీమూతు లను
సుతులు మువ్వురు గలిగి తద్ద్వీపంబునం దమతమనామంబులఁ గౌశలంబును