పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వైద్యుతంబును జైమూతంబు ననుదేశంబులు గల్పించిరి క్రౌంచద్వీపనాయకుం డగు
ద్యుతిమంతునకుం గుశలమనోనుగోష్ణవాచివరాంధకారకేతుమునిదుందుభు లనునం
దను లేడుగురు గలిగి తత్క్రౌంచంబునం దమతమనామంబుల దేశంబులు గల్పిం
చిరి కుశద్వీపవల్లభుం డగుజ్యోతిష్మంతున కుద్భిదుండును వేణుమంతుండును
ద్విరథుండును లంబనుండును ధృతియును బ్రభాకారుండును గపిలుండును నన
నేడుగురుకొడుకులు గలిగి తమతమనామంబులం గుశద్వీపంబున వర్షంబులు గల్పిం
చిరి శాకద్వీపనాథుం డగు మేధాతిథికి నాభి నయన శిశిర శివ క్షేమక ధ్రువు లను
తనూజు లాఱుగురు గలిగి తత్కుశద్వీపంబునఁ దమతమనామంబుల నాఱువర్షం
బులు గల్పించిరి యిట్లు స్వాయంభువమన్వంతరంబునఁ బ్రతికల్పంబున భువనంబు
సుప్రతిష్ఠితం బగు నగ్నిధ్రసంభవుం డగునాభికి నందనుఁ డగుఋషభువలన భర
తుండు జనియించి జనకానుశాసనంబున హిమగిరిదక్షిణభాగంబున భారతవర్షంబు
సకలలోకోత్కర్షంబుగా నేలె నతనికి.

98


సీ.

పుట్టిన సుమతికిఁ బట్టియౌ తైజసువలనఁ ద్రసుం డనువాఁడు గలిగె
తత్సూనుఁ డైనయింద్రద్యుమ్నతనయుండు పరమేష్టి ప్రతిహర్తఁ బడసె నాత
నిసుతుండు నివితుకు న్నేత జనించె వానికి నభ్యపాత జనించెఁ దత్త
నయుఁ డైనప్రస్తోతనందనుండు విభుండు పృథుఁ గాంచె గయుఁ డుదయించె నతని
కతనికి నయుం డతనికి విరతనృపాలుఁ, డతఁడు గనియె మహావీర్యుఁ డతనివలనఁ
బొడమె ధీమంతుఁ డాతనిపుత్రకుఁడు మ, హానుభావుండు తత్సూనుఁ డైనత్వష్ట.

99


క.

కనియె విరాజుని నాతఁడు, గనియె రజోనాము నతఁడు గనియె మహాయో
ధనసవనసమయరిపుపశు, హననపరాయతచిత్తుఁ డగునరజిత్తున్.

100


తరళ.

అతని కుద్భవ మైరి నూఱువురాత్మజుల్ విబుధావన
వ్రతులు వారలపుత్రపౌత్రపరంపరల్ చతురబ్ధివే
ష్టితవసుంధర యెల్ల నిండిన సృష్టిలోఁ గలజంతుసం
తతులు వర్ధిల్లె నంతనుండియు నాడునాఁటికి నీక్రియన్.

101


క.

వలసెఁ బ్రసంగవశంబునఁ దెలుపంగా నేకసప్తతిమహాయుగముల్
నిలిచినస్వాయంభువమను, తిలకమువృత్తాంత మెల్ల దీనిధులారా.

102


ఉ.

నేరెడుదీవి నెల్లెడల నిల్చినతీర్థములున్ వనంబులున్
వారిధులు న్నదు ల్గిరులు వర్షములున్ మొద లైనవానివి
సారము శీతభానురవిసంచరణంబులు భూతమానముల్
మీరు నితాంతకౌతుకసమీహితబుద్ధి వినుండు చెప్పెదన్.

103