పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బున లోకవంచకులై తారు వేరువేర మతంబులు గల్పింపుదు రవి వివేదబహిష్కృతం
బులు మద్విరచితవిశ్వాససంహితానుసరణప్రసక్తులు భక్తియుక్తులు నగువారు ముక్తి
యుక్తు లగుదురు గాని యితరమతావలంబనంబున మేమే రుద్రస్వరూపుల మను
కొనుబైలాలికులకు ముక్తి లేదు. తద్బైలాలికప్రకారంబు వినుండు.

69


సీ.

తొల్లి బృందారకద్రోహిసంహరణార్ధ మే మహాభైరవాకృతి వహించి
బెట్టుగా రణములో నట్టహాసము చేయ దొరిఁగె నుచ్ఛిష్టబిందువులు నాము
ఖమునఁ దద్బిందుసంఘమున సురాసవప్రియులు రుద్రులు పుట్టికి శతకోటి
సంఖ్యాకు లేతదర్చకులు బైలాళికసంజ్ఞతో గౌతమశాపదగ్ధ
మునులు కలికాలమునఁ బుట్టి మోహపాశబద్ధు లయ్యెద రందుఁ బాభ్రవ్యశాండి
లాదు లల్పాగసులు గాన వేదమార్గ, పాశుపతిదీక్షచే ముక్తి వడయఁగలరు.

70


క.

అని చెప్పిన సపర్షులు, చనిరి నిజావాసములకు సంతోషమునన్
వినిపించితిఁ గుంభజముఖ, మునులకు ఘనమోహశాస్త్రములగతి దెలియన్.

71


మ.

ధరణీనాయక యిట్లు మౌనిపరిషద్వంద్యుండు రుద్రుండు సా
దరవాక్యంబుల నాన తిచ్చుటయు నేఁ దద్దివ్యదివ్యాంఘ్రివా
రిరుహద్వందవినమ్రమస్తకుఁడనై మృత్యుంజయా మీరు ము
గ్గురు నేయేపనివేళఁ గర్త లది నాకుం జెప్పు మన్నన్ గృపన్.

72


క.

పరతత్వం బగువిష్ణుఁడు, హరి యనఁగా హరుఁ డనంగ నజుఁ డనఁగఁ జరా
చర్చ మేలు ననెడు వేదాం, తరహస్యం బెఱుఁగ లేరు నరు లజ్ఞానుల్.

73


సీ.

నిత్యుఁ డావిష్ణుఁ డాదిత్యుఁడై పదిప్రకారంబుల దేవకార్యంబు దీర్చు
యోగమహైశ్వర్యయుక్తి నాతడు ప్రతిద్వాపరంబున మానవత వహించి
లోకోపకారార్థమై కొల్చి నాచేత వరములు వడయు నవ్వనజనాభుఁ
గృతయుగంబున నేను నుతియింతుఁ జతురాస్యుఁ డెప్పుడు నను భజియించుచుండు
స్రష్ట నుతియింతు శిశువనై సృష్టి వేళ, నతఁడు మొద లైనసుర లెల్లఁ గృతయుగమున
లింగతనుఁ డైననన్నుఁ గొల్చి పడయుదురు, పరమశివయోగసౌఖ్యసంపత్సమృద్ధి.

74


క.

వనజాసనాండకోటుల్, తనురుహరంధ్రంబులం గలసహస్రశిర
స్కునిఁగా నారాయణదేవుని భావింతురు ముముక్షువులు చిత్తమునన్.

75


గీ.

వేదమార్గరహస్యైకవేత్త లైన, భూనిలింపోత్తములు యజింపుదురు బ్రహ్మ
యజ్ఞమున బ్రహ్మ నెప్పుడు నట్టి బ్రహ్మ, నాఁగ వేదంబు సుమ్ము వింధ్యప్రమథన.

76


గీ.

వినుము శివుఁ డనఁగా విష్ణుఁ డనఁగ శంక, రుం డనఁగ నాదినారాయణుం డనంగఁ
బూరుషోత్తముఁ డన విశ్వపూర్ణమహిమఁ, బ్రస్తుతింపంగఁబడుఁ బరబ్రహ్మ మెపుడు.

77