పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అనుచు ననేకవిధంబుల నిజమనోరథసాఫల్యసదానుకూల్యకు నహల్యకు నాహిమ
వన్నగంబుమహిమ చెప్పుచు వచ్చి తన్నగప్రదేశంబున నొక్కచోట సౌధాంధ
సధేనుయూధపృథూదస్స్వైరనిస్రుతదుగ్ధసమిద్ధసిద్ధరసధారాధునీతీరపారిజాతవ
నాంతరచింతామణిస్థలంబున నేకపాదస్థుండై నిష్ణాపరత్వంబున నిలిచి హుతాశన
లోచనంబును లేలిహానహారంబును నీహారకరకిరీటంబునుం గలనన్ను హృదయం
బున నిలిపి శీతవాతాతపంబులకు జడియక నిలింపులు చలించ నతిఘోరతపంబు
సేయునవసరంబున.

52


చ.

కరినివహంబు రాచుకొనఁగాఁ జలియింపదు బొడ్డుబంటిగాఁ
బెరిఁగినపుట్టలో వెడలుభీకరభోగికులంబు ప్రాఁకఁగా
గురగుర గాదు గడ్డమున గూఁడులు పెట్టినపక్షికోటి పెన్
మొరప మెఱుంగ దెట్లు మునిముఖ్యునియీతను వంచుఁ దాపసుల్.

53


సీ.

బంధత్రయంబునఁ బవనంబు మధ్యమనాళిమార్గమునకు నూలుకొలిపి
గంటు లాఱుఁ బగుల్పఁ గడుహెచ్చువహ్నిచే మీఁదికుండలికన్య మేలుకొలిపి
పరమచిదాకాశభాగేందుమండలస్రవదమృతరసంబు జాలుకొలిపి
నిరవధికానందభరిత మైనతలంపు ఫాలలోచనుమీఁదఁ గీలుకొలిపి
తమ్ము నేలినమనసు లయమ్ము నొందు, టయును నతిభక్తియుక్తి నింద్రియగణంబు
సహజకృత్యంబు లుడుగ నిశ్చలసమాధి, విడువఁ డాహా యితఁ డనుచు వెఱఁగుపడిరి.

54


క.

ఈరీతి నిఖిలవి్స్మయ, కారణ. మగునుగ్రతపము గావించె నహ
ల్యారమణుఁడు నూఱేఁడు ల, పారకరుణ నంత నేను బ్రత్యక్షంబై.

55

నమశ్శివాయపంచాక్షరిసీసము.

యమనియమాయామశమనివేశనమనోమౌనివశ్యాయ నమశ్శివాయ
యానాయమాననానాయననవనవామ్నాయమయాయ సమశ్శివాయ
వనయోనియామినీవామేశశశ్యంశుమన్నయనాయ నమశ్శివాయ
వ్యోమానుయాయిమాయామానవాశనమాననాశాయ నమశ్శివాయ
యని వినయమున ముని యనయమును విశ్వ, మనువనమ్మున నెమ్మినై నున్ననన్ను
నెమ్మనమ్మున నమ్మిన నెమ్మి నేను, నోమునీశాన యిమ్మన వేమి యనిన.

56


ఉ.

నాకినికాయవందిత పినాకి నిరంతభవజ్జటాటవీ
కేకిని మజ్జనోద్యమనకృజ్జనపాలఫలాశనక్రియా
డాకిని వారిబిందునిబిడత్సదనీకిని నాకు నిమ్ము మం
దాకిని నంచు నమ్ముని పునఃప్రణతుల్ ఘటియించి నిల్చినన్.

57