పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

దైవికమున నొకనేరమి, గావించిన నిట్లు విడువఁ గాఁ దగ వౌనే
సేవకుని నన్ను మునులా, రా వలదా యింత కనికరం బైన మదిన్.

43


శా.

ప్రాయశ్చిత్తము పంపుఁ డిందు కనినన్ బాభ్రవ్యశాండిల్యు ల
య్యో యీసాధున కెట్టుగాఁ దగిలె నత్యుగ్రంపుగోహత్య కా
నీ యింకం బదివేలు నేమిటికి మౌనీ దీనిపై జాహ్నవీ
తోయంబుల్ ప్రవహింపఁ జేయు బ్రదుకున్ దోసంబు దీఱుం దుదిన్.

44


సీ.

మాకుఁ జూడంగ సొమ్మసిలి పడ్డది గాని తెగటారఁ జచ్చుట తెలియరాదు
కావున నీపాతకం బసివోవు జాహ్నవిఁ దెచ్చుటకుఁ బ్రయత్నంబు నీవు
చేయు మేమును నింకఁ బోయి వచ్చెదము కోపించకు మం చూఱడించి మునులు
దేవదారుద్రువనీవాటి కరిగిరి గౌతముండును శీతకరకిరీటు
ఘోరతపమున మెప్పించి కొంచు వత్తు, గంగ నా కిది యెంత దుష్కర మటంచు
మగువయును దాను శతశృంగనగము డిగ్గి, కదలి చనుదెంచెఁ జనుదెంచి యెదుటఁ గనియె.

45


క.

అక్షుద్రపాతకానిల, భక్షణపన్నగము బహులబలభిన్నగమున్
విక్షీణోన్నతిధవళిమ, ఋక్షగణాసన్నగమును హిమవన్నగమున్.

46


క.

కని మనమునఁ గోరిక ని, క్క నితాంతానందవార్ధి గరుసెక్కఁXఁ జ
క్కనిసతి నాశిఖరికి మ్రొ, క్క నియోగించుచును మ్రొక్కి కౌతూహలియై.

47


సీ.

ధారుణీగవికి రత్నమహౌషధంబులు చేఁపు పుట్టించినక్రేఁపుఁగుఱ్ఱ
కఱకంఠునకుఁ గాళ్ళు గడిగి గౌరీకన్య ధారవోసినమహాదానపరుఁడు
మౌనికోటికి నెల్ల మన్నింపఁ దగినమేనామానినికిఁ బ్రాణనాయకుండు
తనకూఁతుసవతి మందాకినీనదికి నాధారమై నిలిచినతగవులాఁడు
సురధరిత్రీధరమునకు జోడుకోడె, వనధిసఖ మైనమైనాకమునకుఁ దండ్రి
కాంత కన్నులపండువు గాఁగఁ జూడు, మంచు నమ్మంచుగొండ వర్ణించి మఱియు.

48


క.

ఈమిహికాచలవరుఁడు గు, హాముఖసంచారిమారుతారావములన్
దా మించు నెపుడు ప్రాణా, యామంబును జేయుచున్నహఠయోగివలెన్.

49


గీ.

ఇందు విహరించువిద్యాధరేందుముఖుల, చరణ లాక్షాంకములతోడి చదుము లమరు
హరునికృపఁ గలసినయోగివరులు ముక్తి, సతులుఁ గ్రీడించుపల్లవశయ్య లనఁగ.

50


మ.

తనదండం దప మాచరించి పురభిత్సారూప్యముం బొందుభ
క్తనికాయంబున కియ్య దాఁచినసుధాధామార్ధజాలంబులా
గున నీశైలవిభుండు దాల్చు నెపుడుం గ్రొమ్మంచుపై నిండఁ బ
ట్టినఁ జూపట్టెడుశాక్వరేంద్రఖురకోటీవక్త్రచిహ్నంబులన్.

51