పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అప్పుడు తపసులు తమలో, డెప్పరమా తీఱె నేమిటికి నిఁక నిచటం
గుప్పలు పడి నిలువఁగ రం, డెప్పటిఠావులకె పోద మిందఱ మనుచున్.

34


క.

గుంపులు గూడుకొని విచా, రింపఁగ శాండిల్యుఁ డది యెఱిఁగి గౌతముచే
నంపించుకొనక పోవఁ ద, లంపుట భావ్యంబె పెద్దలారా మీకున్.

35


క.

విపరీతపుఁగఱవున నే, యుపద్రవము నొంద కుండ నోమినమునికిం
గపటింతురె సపితాయ, స్తుపోషక యటన్నమాట చూడఁగ వలదా.

36


మ.

అన బాభ్రవ్యుఁడు నిట్ల తప్ప దన నాహా కూటిమాత్రంబునన్
మన మే మమ్ముడుపోతిమో యితనికిం బాపంబు గా దంచు దు
ర్జనవృత్తిం జనువారలై మునులు నిస్త్రాణంపుగోవున్ సృజిం
చి నియోగించిరి గౌతమాప్తకలమక్షేత్రంబు భక్షింపఁగన్.

37


తరళ.

అరిగి తత్కపటంపుధేనువు నల్లనల్లన మళ్ళలోఁ
దిరుగుచున్ వడి గాలి గొట్టినఁ ద్రెళ్ళుచున్ మఱి లేచుచున్
దరళయై వరి యెల్లఁ జెల్లఁగఁ దత్క్షణంబున మేయఁగాఁ
బరమశాంతుఁడు గౌతముండును బాఱు తెంచి మనంబునన్.

38


శా.

ధేనుగ్రాసము మాన్ప దోస మని సందేహించినన్ సస్య మెం
తే నష్టం బగు నైన నేమి మఱియున్ విత్తంగ యామంబులో
నౌ నన్నన్ మును లెల్ల మిక్కిలియు నేఁ డాఁకొందు రీధేనువుం
దానో మానము దప్ప మేసినది యింతం దోలెదన్ మెల్పునన్.

39


క.

అని నిశ్చయించి హస్తం, బున జలములు పూని తల్లి పొమ్మని ప్రోక్షిం
చిన మాయగోవు పడుచుం, గనుగ్రుడ్లు దిరుగవేసి కాలము చేసెన్.

40


సీ.

అపుడు బ్రాహ్మణు లెల్ల నన్యాయ మన్యాయ మనుచుఁ బేరెలుఁగున నార్చువారు
గోహత్య సిద్ధించె నోహో యితనియింటఁ గుడువఁ గా రాదని గొణుగువారు
నీమహాపాతకి నేల చూచితిరి సూర్యవిలోకనము చేయుఁ డనెడివారు
పిడికెఁడుపూరికై బెడిదంపుసాహసం బెట్టు చేసితి వని తిట్టువారు
నై దిసంతులు గొట్టుచు నమ్మునీంద్రు, గువ్వకరిగొని కడువెత కుడువఁ బఱచి
బట్ట గట్టితనంబున నట్టె గట్టి, గదల వారికిఁ బ్రణమిల్లి గౌతముండు.

41


మ.

అకటా ధేనువుమీఁదఁ జే యిడితినో సామర్షవాక్యంబులన్
బెకలం దోలితినో బుభుక్షకుఁ దగన్ మేయంగ నీ నైతినో
ప్రకటం బైనమదీయపూర్వకృతపాపం బెట్టిదో కాక మి
న్నక గోహత్యకుఁ బాత్ర మైతి ననుచున్ బాష్పాంబువుల్ గాఱఁగన్.

42