పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్యానిరతాత్మ సంయమివరా మధురాన్నము లెల్లరామయో
షానగరంబునం బరమసాధ్వులచేఁ గొనివచ్చునంతకున్.

102


క.

అని వినయముతోడఁ దపో, ధనపతి నొడఁబఱచి గురుపదస్మరణము గై
కొని రామయోషనికటం, బున నున్నవనంబు చొచ్చి పోయెడువేళన్.

103


సీ.

అర్పించె నొకకోమలాంగి సంభ్రమమున వచ్చి పువ్వులవంటివంటకంబు
వైచె ఫలంబులవంటిలడ్వాలు మ్రొక్కుచు నొక్కపృథులవక్షోజయుగళ
వడ్డించె నొకవరవర్ణిని కడువేడ్క పడి పరాగమువఁటిపంచదార
వంచె మరందంబువంటికమ్మనినేయి మన్ననతో నొక్కమధురవచన
మఱియు వనదేవతాస్త్రీలు మహీరుహములఁ, బుట్టి పెట్టెడువివిధాన్నములకు నెడము
చూపెఁ గీకటమునిపాత్ర సూక్ష్మ మయ్యు, మహిమ బహువిద్యలకుఁ గవిమనసువోలె.

104


శా.

ఈరీతిన్ గడువేగ వాంఛితఫలం బీడేర ధన్యుఁడ సం
సారాంభోనిధిపారగుండ నని యిచ్చెన్ మెచ్చుచున్ వచ్చి నై
జారణ్యస్థలి నన్నిషాదముని భిక్షాపాత్రముం బెట్టి దే
వా రావయ్య భుజింప నంచు వినతుండై పల్క దుర్వాసుఁడున్.

105


గీ.

మనసులోపల నీతనిమహిమ నిజము, గా నెఱించెద ననుచు నోమౌని నదికి
నడవనోపము చేఁ గమండలువు లేదు, సలిలములు దెమ్ము మాకు నాచమనమునకు.

106


సీ.

అనవుడు శబరసంయమి కొంతతడవు విచారించి గురుపదాబ్జములు డెంద
మున సంస్మరింపుచుఁ బోయి చేరువ నున్న దేవికానది డాసి దేవి కామి
తార్ధదాయిని పాపహారిణి లోకపావని తల్లి నాకు భవజ్జలావ
గాహనంబును దేశికధ్యానమును దక్క నన్యంబు లేదు మహామునీశ్వ
రాగ్రగణ్యుండు దుర్వాసుఁ డరుగుదెంచె, నతిథియై నేఁడు రానోపఁ డలసి తీర్థ
మాడ నావిన్నపము విను మచట విమల, వారి దొరకదు విచ్చేయవలయు ననిన.

107


మ.

క్షమపై నద్భుత మావహిల్ల శశిరేఖాభంగశృంగారయై
సముదాత్తధ్వనిపూర్యమాణసకలాశాభోగయై చక్రవి
భ్రమరోధోనిపతత్పయఃకణికయై పాఱె న్నిషాదేంద్రవ
త్సము వెంట న్వడి దేవికాసురభి సంజాతోన్ముఖత్వంబునన్.

108


వ.

ఇవ్విధంబున సవిధంబునకు వచ్చినదేవికాతరంగిణిఁ గృతస్నానుం డై దూర్వా
సుండు శబరతాపసుండు వడ్డింప నాఁకంట నాకంఠపూరితంబుగా బహువిధాహా
రంబు లారగించి నిజలోచనాంచలంబులం గారుణ్యరసంబు దొలంక నతని వంకఁ
జూచి నీవు గురూపదేశమార్గంబున సత్యం బవలంబించి తపంబు గావించితివి గావున