పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నావుడు వరాహమునకు మ, హీవనరుహపత్రనేత్ర యి ట్లనియె మహా
త్మా వనితలుఁ బురుషులు ని, న్నేవిధమునఁ గొలువ మెత్తు వెఱిఁగింపు దయన్.

69


గీ.

అని పలుక దంభకోలనాయకుఁడు భూమి, కామినీ భావసాధ్యుండఁ గాని మంత్ర
హోమదానాదివిధుల సాధ్యుండఁ గాను, నిక్క మైనను వినిపింతు నొక్కవిధము.

70


వ.

బ్రహ్మచర్యంబు సత్యంబు నసంగ్రహంబు నస్తేయంబు నహింసయు మొదలుగాఁ
గలయవి మానసవాచకవ్రతంబు లేకభుక్తంబు నక్తంబు నుపవాసంబు మొదలుగాఁ
గలయవి కాయికవ్రతంబులు వీనిలోన మానవులు శరీరక్లేశకరవ్రతంబులు సలిపి
రేనియు విధేయుండ నగుదు నేతదర్థంబునకు నితిహాసంబు చెప్పెద మున్ను సన్ను
తాచారధుర్యుం డరుణిమునివర్యుండు పుణ్యనదీతీరంబునఁ దపంబు చేయ నుద్యో
గించి పోవుచుఁ గ్రమక్రమంబున.

71


మ.

బుధవంద్యుం డతఁ డొక్కపావనవనీభూమి న్విలోకించె
ర్నిధికల్లోలఘటావసక్తజలవేణీనీవిక న్నిర్గళ
న్మధుమత్తభ్రమరీమిళత్కమలగంధస్రావికన్ బాహుదం
డధృతారిత్రవిచిత్రసంతరణనానానావిన్ దేవికన్.

72


సీ.

ఈతెఱంగున దేవికాతరంగిణిఁ గనుంగొని తటంబునఁ బనసవకుళ
నారంగపూగపున్నాగాదినానాగపుష్పపూర్ణారణ్యపుణ్యభూమి
సతతంబు నిట్రుపాసములతో నత్యుగ్రతపము గావించుచుఁ దానమాడ
నొకనాఁడు చనుచోట నోరి బాపఁడ పెట్టు పెట్టు మటంచు నాకట్టుకొన్న
పాపకర్మునిఁ గార్ముకబాణపాణిఁ, గ్రూరదృష్టులయెఱజేరుగ్రుడ్లవానిఁ
జెంచు తెరువాటుగాని వీక్షించి తపసి, తల్లడంబున శ్రీహరిఁ దలఁచి నిలిచె.

73


క.

దొంగయు హృదయసరోరుహ, భృంగీకృతశార్ఙ్గధరుని ఋషిఁ గనుఁగొని వి
ల్లుం గోలయు ధర వైచి క, లంగుచు నంజలిమిళల్లలాటస్థలుఁడై.

74


ఉ.

ఓసదయాత్మ సంయమికులోత్తమ పిన్నటనాఁటనుండి నేఁ
జేసినపాపపుంజెడుగుచేఁతలు చెప్పెద నుప్పుగోకకున్
భూసురకోటి నట్టడవిఁ బొట్టలు చించితి బిట్టు గొంతుకల్
గోసితి నల్లపూసకొఱకుం బదివేవురుపుణ్యభామలన్.

75


గీ.

ఇన్ని చేసినఁ గడపట నింటిలోనఁ, ద్రావుడికి లేదు పాపంచె తగిలెఁ గాని
వల్కలములకుఁగాఁ జంప వచ్చి నిన్ను, గనుఁగొని మహాద్భుతంబు శాంతుండ నైతి.

76