పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గావునఁ బున్నమనాఁడు కృతోపవాసులై భక్తియుక్తి నర్ఘ్యంబు లిచ్చి యవా
న్నంబు భుజియించినవారికి నత్యంతకాంతి తుష్టి పుష్టి ధనధాన్యసమృద్ధులు సిద్ధిం
చు రాజకులోత్తంస తిథిప్రశంస వినిపించితి నింక రత్నోద్భవులవృత్తాంతంబు
వినుము వారిలోన సుప్రభుండు వర్తమానకృతయుగంబున నీవై జనించి ప్రజాపాల
నామంబు దాల్చెఁ దీప్తతేజుండు వత్సనామంబును సురశ్మి శశికర్ణనామంబును సుద
ర్శనుండు పాంచాలనామంబును సుకాంతి యంగనామంబును సుందరుండు వంగ
నామంబును సుందుండు ముచికుందనామంబును సునాముఁడు సోమదత్తనామం
బును శుభుండు సంవరణనామంబును సుశీలుండు వరదాననామంబును సుము
ఖుండు కేకయనామంబును శంభుండు సేనాపతినామంబును సుకాంతుండు దశరథ
నామంబును సోముఁడు జనకనామంబును వహించిరి కడమపదియేవురు త్రేతా
యుగంబున నవతరించి కర్మభూమికి నాయకులై బహువిధాధ్వరంబులు చేసి నాక
లోకసౌఖ్యం బనుభవింపఁ గల రని చెప్పి బహుమానపూర్వకంబుగా నమ్మహీనాథు
వీడ్కొలిపి యోగమహత్వంబున విష్ణుతత్వంబునం గలసె నిట మహీపాలుఁడగు
ప్రజాపాలుండును మహాతపఃకథితపరమబ్రహ్మవిద్యాశ్రయకథాశ్రవణంబున విర
క్తుండై తపంబు సలుప నరుగుసమయంబున.

63


క.

ముందట నవలోకించె ము, కుందసమీపాభిసారిగోపప్రమదా
నందకరకుంజములు గల, బృందావనమున్ మునీంద్రబృందావనమున్.

64


క.

ఆవనమున ఘోరతపము గావింపుచు నుండి కొంతకాలంబునకుం
గోవిందనామధేయుని, శ్రీవనితావిభుని వినతి చేయఁ దొడంగెన్.

65


క.

గోవింద వేదవేద్య శ, చీవరసోదర నిశాటసేనాసుభట
గ్రీవాకదుష్ణరుధిర, ప్లావితకరచక్రధార భక్తాధారా.

66


క.

శరనిధిమగ్నధరాధూ, ర్ధర శబ్దస్పర్శరూపరసగంధాఖ్యా
విరహిత పరిపూర్ణసుధా, కిరణసహస్రప్రకాశ కితవమృగేశా.

67


సీ.

పన్నగతల్ప నీభక్తులతోఁ బొత్తు మని కాని దుఃఖంబు మఱవరాదు
నిఖిలజగన్నాధ నీచరిత్రంబులు విని కాని మోహంబు విడువరాదు
పుండరీకాక్ష నీపుణ్యతీర్థములకుఁ జని కాని కలుషంబు చదుపరాదు
నిగమాంతసంస్తుత్య నీపదద్వంద్వంబు గని కాని జన్మంబు గడవరాదు
కనకగర్భాదులకు నైన ననుఁ గృతార్థుఁ, జేసి రక్షింపు మని ప్రశంసింప మెచ్చి
తనకుఁ బ్రత్యక్షమైనవిష్ణునిశరీర, మున లయం బయ్యె నరపాలపుంగవుండు.

68