పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు మందరాగం బమందరాగంబునం బెకలించి తెచ్చి కవ్వంబుగా నమర్చి వా
సుకిం దరిత్రాడు చేసి వివిధౌషధివితానంబు సుధాంబునిధానంబున వైచి వైచిత్రి
మెఱయ మఖవత్ప్రముఖనిఖిలాదిత్యులు దైత్యులు వాలంబును శిరంబునుం జుట్టి
పట్టి త్రచ్చి త్రచ్చి దృఢముష్టినిపీడనంబునం గరతలంబులు పొక్కినఁ దొలంగువా
రును జంగసాచినపదంబులు నొప్పిదీఱ నప్పటప్పటికి వీడ్వడ నిడుసమయంబునం
గానక త్రొక్కిన నలుంగువారును సవ్యాపసవ్యభ్రమణరభసంబునం దోడుతోడం
దొరఁగుమందరగండశైలంబులు దాఁకిన లోఁగువారును నేత్రశ్రవోవదనగహ్వర
జిహ్వాలవిషనిశ్వాసవైశ్వానరంబు సెకలు సోఁకిన వేఁగువారును సముల్లోలకల్లోల
హల్లీసకప్రభూతజంఝానిలంబులు చఱచి కొట్టినం గూలువారును నిరంతరమథన
ప్రయాసవశంబున దప్పి పుట్టిన దగదట్టి సోలువారును నైన నుభయపక్షంబులలో
పలఁ గొందఱు ధైర్యంబుకలిమిఁ బ్రాణంబులు పిడికిటం బట్టుకొని వట్టిబిగువున
నిలిచిన విలోకించి కించిద్విహసనంబులు వదనారవిందంబునకు విందులుగా గోవిం
దుండు సంభ్రమంబున.

59


శా.

వాచామాధురి దేవదానవుల నాశ్వాసించుచున్ వచ్చి ధ
ట్టీచామికరచేలమున్ బిగియఁ గట్టెన్ మీఁదికిం ద్రోచె బా
హాచంచన్మణికంకణంబులు గృహీతాహీంద్రపుచ్ఛాననుం
డై చేచేత మథింపఁగాఁ దొడఁగె దుగ్ధాంభోనిధిన్ భూవరా.

60


సీ.

నగఘర్షకండూయనము సౌఖ్యమునఁ గూర్కు పట్టుకూర్మము గుఱుపెట్టె ననఁగ
నద్రిమూలోపలాహతుల భగ్నము లైనచిప్పల ముత్యాలు చెదరె ననఁగ
నచలనిర్మథనజాతాత్యుష్ణమున సుధాంభోనిధానముమేను పొక్కె ననఁగ
క్ష్మాధరోత్తుంగశృంగవిఘట్టనమునఁ జుక్కలు రాలి తెట్టువ గట్టె ననఁగ
ఘుమఘునుధ్వానకోలాహలములు చెలఁగ, గగనవీథికి దుగ్ధశీకరము లెగసె
తఱుచుగా బుద్బుదంబులు దలలు సూపె, నాల్గువంకలఁ గలయ ఫేనములు గ్రమ్మె.

61


క.

ఆసలిలాకరమథనము, చే సోముఁడు పుట్టె నిజరుచిస్థగితాశుం
డై సర్వశాస్త్రమథనము, చే సుజ్ఞానంబుకరణి శ్రీపతియెదుటన్.

62


వ.

ఇట్లు చరాచరప్రపంచంబునకుఁ బ్రాణం బైనసోముండు సంభవించిన సంతోషించి
మధుకైటభారాతియు నీరాకరమథనక్రీడ చాలించి వైకుంఠంబునకుం జనియె నది
మొదలుగా ధూర్జటి జటాజూటంబున సోమకళ ధరించు క్షేత్రజ్ఞుండును జలాత్ము
కుండును నైనసోమునివలనఁ బ్రతిపదాదివాసరాధిదైవతంబులు పదార్వురుదేవమాన
వులు నోషధులు వృక్షంబులు నిరాతంకంబున బ్రదుకు నిట్టిసోమునిజన్మదినంబు