పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ప్రామిడి కానఁ గించిదపరాధము సైపక యిట్లు దిట్టఁగా
నేమి ఫలంబు గల్గె నశియింపుము నీవు నటంచు సోముఁడున్
మామ నవంధ్యకోపమున మాఱుకు మాఱు శపించి సృష్టిలో
నామవినాశమై వెదకినం బొడగానఁగ రాక పోయినన్.

51


సీ.

గ్రక్కున సప్తపారావారవలయితక్షోణిమండలి వాన గురియ దయ్యె
వాన లేనికతాన వాడి వత్తులవలె సకలసస్యంబులు సమసి పోయె
సకలసస్యంబులు సంక్షయించిననిమిత్తంబున జీవిసంఘంబు నలిగె
జీవిసంఘంబు నొచ్చినకారణంబున సవనకృత్యంబులు చట్టువడియె
సవనకృత్యంబు లడఁగిన నవసి నవసి, వాసవాదిసుపర్వులు వరుగులై జ
గల్లతామూలకందంబు గమలనాభుఁ, డున్నకడ కేగి యాదశ విన్నవింప.

52


గీ.

ఆరమాభర్త నిర్జరులార యిప్పు, డోషధీమూలముల సోముఁ డున్నవాఁడు
గానఁ దడయక మీరు రాక్షసులు దుగ్ధజలనిధానంబు దరువుఁ డోషధులు వైచి.

53


చ.

అని వనమాలి వేల్పులకు నానతి యిచ్చి మృగాంకశేఖరున్
వనరుహసంభవుం దలఁప వారును వచ్చిరి వారుఁ దాను వా
హనముల నెక్కి పోవుచుఁ బ్రియంబునఁ జూచిరి ఫుల్లకేతకీ
వనసురభీకృతత్రిపురవైరిమహారధి దుగ్ధవారిధిన్.

54


క.

కని రాజహంసలు భజిం, ప నున్నమత్పుండరీకమండలములు డా
కొనఁ జక్రవర్తులవిధం, బున నానాద్వీపరక్షఁ బొదలుతదబ్ధిన్.

55


క.

డగ్గఱి జలపానాగత, దిగ్గజకటగళితమదనదీసౌరభస
మ్యగ్గంధవహము తనువుల, మొగ్గచెమట లాఱ విసర ముదితాత్మకులై.

56


సీ.

తేలెడుపవడంపుఁదీఁగెలు వాహినీసతులు దీసిననఖక్షతము లనఁగ
నూరుల విహరించ నురగులమణిఫణంబులు భుజాంగదముల మొగపు లనఁగ
నాడ కాడకు మీఱ నాడెడుజలధరస్తోమంబు బడబాగ్నిధూమ మనఁగ
దాటుమీనంబులు తత్స్థితాసురవీరు లెగురవైచిన శాతహేతు లనఁగ
సంతతంబును బహువిశేషముల మెఱసి, యీసుధాంభోనిధానంబు దృక్కరంభ
మై మనమనంబులకు మోద వహించె, ననుచు నొండొరుతోఁ జెప్పుకొనుచు నిలిచి.

57


శా.

ఆవైకుంఠహరాబ్జజుల్ వనుప హల్లాల్లధ్వనిన్ మందర
గ్రావంబున్ సురదైత్యకోటి వెఱుకంగా నొప్పె రంధ్రంబు నై
జావాసంబుననుండి వాసుకిమహావ్యాళంబు నేత్రర్థమై
రా విస్తారపుఁద్రోవ చేసినగతి బ్రాప్తాతిగంభీరతన్.

58