పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ప్రభువు లాశ్రితపక్షపాతంబు విడిచిరి పుణ్యవర్తనములు పొనుగువడియె
ప్రాజ్ఞులు వేదశాస్త్రంబులు మఱచిరి సకలవర్ణములు బెజ్జంబు గలసె
బలవంతు లధముల బాధింపఁ దొడఁగిరి యిల్లాండ్రయీలువు లెత్తిపోయె
సత్యంబు పలుకుట జనులు చాలించిరి చెడియె నుత్తములదాక్షిణ్యగుణము
పాడి దప్పిరి నృపతులు బలసెఁ గొండె, మడఁగెఁ దాలిమి మాత్సర్య మతిశయిల్లెఁ
జెల్లె దయ పాతకంబులు వెల్లివాఱెఁ, గ్రమ్మె దుర్వ్యసనంబులు దిమ్ము రేఁగె.

31


మ.

జగతీనాయక యిట్లు ధర్మము వినాశం బైన దేవాసురుల్
తగవుల్ దప్పి పరస్పరాంగనల నుద్దండంబునం బుచ్చుకో
జగడం బత్యధికంబు గాఁ దొడఁగుటన్ శాంతంబు గావింప రా
క గుముల్ గూడి రణంబు చేసిరి వడంకన్ మూఁడులోకంబులున్.

32


క.

అప్పుడు నారదసంయమి, చెప్పిన విని కళవళంబు చిత్తాబ్జములో
నుప్పతిల నంచతేజీ, నెప్పళమున నెక్కి నలువ నిలువక వచ్చెన్.

33


గీ.

వచ్చి కలహంబు వారించి వారివలన, నిజతనూజుండు ధర్ముండు రజనికరుని
చేఁ దిరస్కృతుఁడై వనసీమమునకుఁ, నరుగుట యెఱిఁగి తత్సురాసురులు గొలువ.

34


వ.

చరాచరశరణ్యుండు హిరణ్యగర్భుండు మహారణ్యంబు చొచ్చి వృషభరూపంబున
విహరించుధర్మపురుషుం జూపి యీపరమపావనుం గొనియాడుం డనిన దేవ
దానవులు మకుటతటఘటితాంజలులై హారనీహారతారాధనధవళాంగ చతుశ్శృంగ
సముత్తుంగద్విమస్త సప్తహస్త సఫలీకృతవేదవాద చతుష్పాద సకలసృతిపురా
ణేతిహాసప్రసిద్ధత్రిబంధబంధమోక్షలక్ష్మీకరారవిందలీలాదర్శక సర్వమార్గప్రదర్శక
పాపతిమిరాపనోదనప్రదీప సమస్తదైవతస్వరూప వాన లేని సస్యంబులకైవడి నీవు.
లేని కారణంబున లోకంబులు చీకాకుపడియె మృగాంకుండు చేసినతప్పు సహించి
మమ్ము నిర్వహింపు మని సన్నుతించినఁ బ్రసన్నుండై ధర్మదృష్టి విలోకించిన వారు
విగతసమ్మోహు లైరి పితామహుండును వత్సా నీవు సంచరించుటంజేసి యిక్కాన
నంబు ధర్మకాననం బనం బరంగు బ్రాహ్మణవదనంబులు సదనంబులుగా నిలిచి నీవు
పూర్వప్రకారము త్రిభువనంబులు శాసింపు మని సన్మానించి యిది మొదలు ధర్మంబు
గడవక నడవుం డని సురాసురుల వీడ్కొలిపి నిజనివాసంబునకు విజయం చేసె
నిట్టిధర్మునిజన్మదినంబు గావునఁ త్రయోదశినాఁడు కథ విని పాయసాహారంబు భుజి
యించిన జనంబులకు ననేకధర్మంబులు సిద్ధించు విశేషించి యీధర్మోత్పత్తి శ్రీ
కాలంబునఁ బఠించినఁ బితరులకుఁ బునరావృత్తిరహితశాశ్వతబ్రహ్మలోకంబు
గలుగు మహీవల్లభ యింక మహాతత్త్వంబు రుద్రుండై పుట్టినవిధంబు వినుము.

35