పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఈగజగామినిఁ గామిని, నేగతి నే సందు గొందు నిఁక నని విధుఁడున్
వేఁగుచు గురుఁ డిలు వెళ్ళిన, చో గానము చేయు నవ్వుఁ జూచిన మ్రొక్కున్.

20


సీ.

నైపుణి లిపిలేఖనం బొనర్పక ఫలకమునఁ దద్రూపలేఖన మొనర్చు
కరపుస్తకావలోకనము సల్పక తదాకారరేఖావలోకనము సల్పు
వ్యాఖ్యానశబ్దంబు లాలకింపక తత్పదాంగదశబ్దంబు లాలకించు
తనలోన శాస్త్రచింతనలు చేయక తన్నితంబసంస్పర్శచింతనలు చేయు
నివ్విధంబున దివసంబు లెన్ని యైనఁ, గడపి వేసరి గీష్పతికన్ను మొఱఁగి
తెగువ నొకనాఁడు పైకొంగు తిగిచి తార, సమ్మతిలుటయు నోలాడె సౌఖ్యజలధి.

21


క.

ముల్లోకంబుల జనములు, రోళ్ళన్ రోకఁడఁ బాడ రోయక మఱియున్
వెల్లవిరి గాఁగఁ దిరిగి న, గళ్ళకు నయగారి మెలఁతుకం గొనిపోయెన్.

22


గీ.

పోయి పెద్దలు చెప్పినబుద్ధి వినక, కిల్బిషం బని మానక కెలనివారు
నగుట యెఱుఁగక రాజు తా నగుటఁ జేసి, దారవలె నవ్విధుఁడు సదా రమింప.

23


గీ.

ధర్ముఁడు వడంకి కడుపాపకర్ముఁ డైన, చెడుగు హిమధామునకు బుద్ధి చెప్పనేని
తప్పుఁ గార్యంబు బ్రహ్మచిత్తంబు మిగుల, నొచ్చు నాకు నదక్షత వచ్చు ననుచు.

24


క.

అరుదెంచి పలికె ని ట్లని, గురువులసతి నెట్టు వేసికొంటివి నీకున్
వరుసా కటకట దోషా, కర యీపాతకము సేయఁగాఁ గాదు సుమీ.

25


సీ.

అఖిలవేదాతీతుఁ డైనశ్రీమ న్మహాదేవుండు నిను శిరసావహింప
ముప్పుత్రిప్పులు లేక ముప్పదిమూఁడుకోటులు సుధాంధసులు నీవలన బ్రతుక
తండ్రి దుగ్ధపయోనిధానంబు నినుఁ దనకన్నులారఁగఁ జూచి మిన్నుముట్ట
పరమధర్మంబు దప్పక చతుర్దశభువనంబులు నీశాసనమున మెలఁగ
రాజవై వేఁడు కడపట నోజ మాలి, తెచ్చుకొంటివి పాయనితిట్టు రట్టు
నకట యిఁక నైన నా చెప్పినట్లు చేసి, దేవతాచార్యునకుఁ దారఁ దిరుగ నిమ్ము.

26


క.

ఈనీదుర్వ్యసనము విని, నానాభువనముల జనులు నయహీనత రా
జానుమతోధర్మ యనం, గా నడుతురు గానఁ దగవు గాదని పలికెన్.

27


క.

ఆపలుకులు విని కామాం, ధోపి న పశ్యతి యనన్ శశాంకుండు దురా
లాపము లాడక పొ మ్మని, కోపాటోపమున వెడలఁగొట్టించుటయున్.

28


క.

ఏగె మణిహంబు మాని మ, హాగహనంబునకు ధర్ముఁ డవమానముతో
వేగమ ధర్మస్యత్వరి, తాగతి యనువచన మివ్విధం బయ్యె ననన్.

29


క.

ఈవిధమున దుష్కర్మము, త్రోవ నడవఁ గడఁగి నలుగురుం జూడఁగఁ దా
రావిటుఁ డటు చేసినపరి, భావంబున ధర్ముఁ డడవిపా లైనతఱిన్.

30