పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

వాసవప్రముఖదేవతలార ప్రథమాంశమునఁ దృప్తి పొందె నామనము దక్ష
మఖము ధన్యత వహింప ననుగ్రహించితి భగులోచనముఁ బూషుపండ్లు మున్ను
వలె నుఁడఁ జేసితిఁ గలనిలో మత్ప్రతాపంబు గనుంగొని పశువులై చ
రించినమిమ్ముఁ బాలించి విజ్ఞాన మిచ్చితిఁ గాన నేఁ బశుపతి సమాహ్వ
యమున విహరింతు నీదినం బాది గాఁగ, శాంతులై భూతిరుద్రాక్షజటలతోడఁ
బాశుపతదీక్షు ననుఁ గొల్చుభక్తవరులు, మోక్షలక్ష్మీవధూరత్నమునకు వరులు.

124


క.

అని గీర్వాణులతో మ, న్నన నానతి యిచ్చురుద్రునకు వాక్పతి ద
క్షునిసుత గౌరి జగన్మో, హిని గుణవతిఁ బెండ్లి చేసి యి ట్లని పలికెన్.

125


వ.

దేవా యీవామనేత్ర జగజ్జనయిత్రి మత్తకీరవాణి రాణి గా నిజప్రభావసకల
గిరిపరిహాసం బైనకైలాసంబు నివాసంబుగా వాసవప్రభృత్యాదిత్యులు భృత్యు
లుగా నస్మదాదులకుఁ బూజ్యుఁడవై లోకైకసామ్రాజ్యవైభవంబు లనుభవింపు
మని తదనుమతంబున దక్షప్రముఖులు గొలువఁ బ్రాజాపత్యపురంబునకుం జనియె
నిట నిటలాక్షుండు దాక్షాయణిం దోడ్కొని మహాప్రమథగణంబు భజింప రజ
తాచలంబునకు విజయం చేసె నని వరాహదేవుండు చెప్పినఁ గుంభినీరంభోరువు
మీఁదటివృత్తాంతం బానతి మ్మని విన్నవించిన.

126


శా.

ఏణీదృఙ్మకరాంక సాల్వనరసింగేంద్రానుకంపాసరి
ద్వేణీవర్ణితకీర్తికల్పక చతుర్వేలాసమావేల్లిత
క్షోణీభారభరాణదక్షిణభుజా కుంభీనసాధ్యక్షగీ
ర్వాణీసంతతగీయమానరణదుర్వారప్రతాపోదయా.

127


క.

నిర్ధ్వస్తసకలకలుష ము, హుర్ధ్వనితవరూధినీమహోగ్రపటహభి
న్నోర్థ్వాండ చక్రవాళబ, హిర్ధ్వాంతపరంపరాసుహృత్కీర్తివిభా.

128


పంచచామరము.

కుఠారశూరవారకంఠకుంఠనైకమర్మక
ర్మఠారిదారి శౌరిభక్తిరక్తియ క్తిఫల్గుణా
శఠారిభూవరాసువాతజాతవేదిగూఢపా
త్కఠారికా కఠోరదోరఖర్వగర్వదూర్వహా.

129

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునఁ బంచమాశ్వాసము.