పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఓహో యీగతిఁ బోరఁగా సకలలోకోపద్రవం బయ్యెఁ జుం
డీ హంకారము మాని పూనుఁ డిఁక శాంతిన్ మీరు మీలోన నే
హింసాపరతంత్రబుద్ధి హరిరుద్రాస్త్రావతంసంబులా
రా హేరాళము వెళ్ళెఁ గాల మని చేర న్వచ్చి ప్రార్థించినన్.

120


సీ.

ఆరుద్రనారాయణాస్త్రద్వయంబు శాంతి వహించుటయు భారతీవరుండు
శంకరాంబురుహలోచనుల నిరీక్షించి హరిహరులార చరాచరప్ర
పంచరక్షణము గావించుఁడు మీ రంచు వచియించి సర్వగీర్వాణులార
క్రతువుల మొదలిభాగము రుద్రయోగ్యం బటంచు వేదములు ఘోషించుఁ గానఁ
దొలుత యజ్ఞాంశ మిచ్చి రుద్రునిపరాక్ర, మంబు కొనియాడి సత్కృపామహిమ గాంచి
బ్రతుకుఁ డనవుడు వారలు పరమభక్తి, యుక్తి దండప్రణామంబు లొసఁగి నిలిచి.

121


రగడ.

రుద్ర జగద్రక్షా దాక్షిణ్య కారుణ్యసుధారసపూర్ణదృగంచల
భద్రగుణైకాశ్రయ మధ్యందినభానుసహస్రసమానతనుప్రభ
ఖట్వాంగకురంగకపాలత్రిశిఖప్రముఖవిభాసిభుజామండల
పట్వాపకలాపగూఢపాత్పరివృఢహారధురంధరకంధర
కంఠేకాల మదావళదనుజాఖర్వగర్వరేఖానిర్వాపక
కుంఠీభూతత్రిపుర ధాతృవైకుంఠాదిసుపర్వస్తుతవిక్రమ
ఫాలాంబకపావకచుంబితరతిపతిభస్మస్థాపకవక్షస్స్థల
బాలసుధాకరకోరకితజటాపటల భగాక్షినిపాటనకరశర
పోషితభక్త చపేటనిపాతితపూషదంద దంతురితరణాంగణ
యోషాయితవామశరీర మహాయోగిహృదయపుష్కరపుష్పందయ
ప్రధ్వస్తాధ్వర బహువిద్యామయరథబద్ధచతుర్వేదతురంగమ
సాధ్వసదాయికఠోరదంష్ట్రికచకచకశోభామ్రేడితాట్టహాస
వెంగలిదక్షునిఁ గూడినకతమున విజ్ఞానము చెడి పశువుల మైతిమి.
గంగాధర వేయేటికి నీభారము మనుపంగా నొచ్చినవారము.
జగదుత్పత్తిస్థితిలయములు నీశాసనమున వర్తిలు సంతతమును
నిగమోక్తప్రథమాంశము గొని మన్నించి యజ్ఞ మీడేరఁగఁ జేయుము.

122


మానిని.

అంచు మహేంద్రముఖామరపుంగవు లంగములం బులకాంకురముల్
ముంచుకొనం గరముల్ నిటలంబుల మోపుచు భక్తిసమున్నతిఁ బ్రా
ర్థించిన వారలదీనత మాన్పఁగ దేవుఁడు చల్లనిచూపుల వీ
క్షించి సుధాపరిషిక్తమృదూక్తివిశేషము దోఁప వచించెఁ గృపన్.

123