పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఈచందంబున భూతపి, శాచంబులు వైవ దేవసైన్యంబులు నా
రాచములు ముంప భూతపి, శాచములుం దఱుమ దేవసైన్యము విఱిగెన్.

113


క.

విఱిగినఁ గని మఖశాలకు నుఱికి వసుంధర వడంక నొండొరుఁ గడవం
బఱచుచుఁ బండులు పటపటఁ, గొఱుకుచు నారుద్రసైనికులు ధౌర్త్యమునన్.

114


సీ.

స్ఫ్యంబులు నఱకి యూపంబులు గూల్చి సోమము గ్రోలి కృష్ణాజినములు చించి
మునులభార్యల దోఁచుకొని పురోడాశంబు మెక్కి వేదులు గొఱ చక్కులాడి
హెూమకుండములు నిర్ధూమధామంబులు గావించి పశువుల గావు పట్టి
స్రుక్కులు విఱిచి ఋత్విక్కుల బాధించి సదమదంబుగ సభాసదులఁ దోలి
సవనవాటంబు నుగ్గునూచంబు చేసి, యింద్రు లోపలఁ గాన మేసంది గొంది
నడఁగెనో చూడుఁ డాసోమయాజిగాని, ననుచుఁ బరువులు పెట్టుచో నమరవరులు.

115


క.

ఆహవసన్నాహప్రతి, ఘాహుంకారములు నిగుడఁ గౌక్షేయకరా
ళాహతుల భూతబలసందోహంబులమీఁదఁ గవిసి నొప్పించుటయున్.

116


వ.

రుద్రుండు రౌద్రసమున్నిద్రుండై మరుద్రాజి నాజిం బడలువఱచి మెఱుంగు మెఱ
చినచందంబున నిజస్యందనంబు మెఱయ నెఱయం బరాక్రమించి మించినం గని
భగుండు దిగిధంబులు వెగడుకుడువ నార్చి యెదిర్చి పేర్చిన వానికన్ను కార్చిచ్చు
వంటిశరంబునం బోకార్చి తత్సహోదరుండు భుజదండకుండలీకృతకోదండపరి
వేషుండు పూషుండు ధట్టించి కిట్టిన మిట్టకోలలఁ దొడిగి వానిపండ్లు డుల్ల నేసి బోసిం
జేసి హెచ్చుటయు నొచ్చి వియచ్చరులు విచ్చి భయపలాయమాను లైన మగుడ
వారి నాలంబునకు నూలుకొలిపి కట్టినపచ్చపట్టుదట్టిచెఱఁగులు రింగులువాఱ భుజా
ర్గళచతుష్టయంబున శంఖచక్రగదాశార్ఙ్గంబులు పట్టి వినతపట్టి నెక్కి మార్కొని
జనార్దనుఁడు నారాయణాస్త్రంబు ప్రయోగించినఁ గపర్ది పాశుపతాస్త్రంబు
వఱపె నిట్లు హరిహరముక్తంబు లైనదివ్యశరంబులు పరస్పరజిగీషామర్షంబున వర్ష
సహస్రంబులు సమరంబు సలుపుచు నప్రతిహతప్రభావంబున.

117


సీ.

ధరియించె నొకటి సుదర్శనచక్రంబు కొనియె ముమ్మోములకుంత మొకటి
కాంచనచేలంబు గట్టె నొక్కటి గప్పె నొకటి చాఱలవన్నెమెకముతోలు
కౌస్తుభరత్న మొక్కటి పూనె గాలిమేతలకడియంబును దాల్చె నొకటి
లేలిహానారి దువాళించె నొక్కటి తొడుకుబాబా నెక్కి తోలె నొకటి
మకుట మొక్కటి సవరించె నొకటిజడలు, ముడిచె నొకటి మెఱసె నంబురుహనేత్ర
ముల నొకటి బేసికన్నుల నిలిచె శంఖ, మొకటి పూరించె డమరుగం బొకటి ద్రిప్పె.

118


క.

అపుడు సమీపంబున ను, న్నపంకరుహసంభవుండు నారాయణపా
శుపతాస్త్రంబులు వీక్షించి పెద్దయెలుఁగునఁ బ్రశంస చేయుచుఁ బలికెన్.

119