పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వేళ హేళిసహస్రదుస్సహమహస్సనాథుండును సర్వజగన్నాథుండును సర్వవేద
మయుండును సర్వజ్ఞానాశ్రయుండును సరోరుహభవాండమాలికాహారమనోహర
గౌరీకుచస్పర్శియు ప్రత్యక్షదర్శియు భక్తమరుద్ద్రుండును నైనరుద్రుండు పదివేల
వత్సరంబులు విశ్వనిర్మిమీషమహాతపంబు చేసి కాండసలిలంబు వెడలి.

103


క.

జనసస్యనివహమృగనగ, వనవనధిసమేత మైనవసుమతిఁ గనియున్
మునిపత్యమానదక్షస, వనదేవాహ్వానమంత్రవైఖరి వినియున్.

104


క.

నను మిగిలి జగతిఁ గల్పిం, చినవాఁ డెవ్వఁడు నితాంతచిత్తాహ మికన్
నను మిగిలి యజ్ఞ ఫలముం, గొనియెడువాఁ డెవ్వఁ డనుచుఁ గోపించుటయున్.

105


ఉ.

అశ్మాత్యంతకఠోరమూర్తులు మహాహాలాహలజ్వాలధూ
మ్రశ్మశ్రుల్ భుజదండహిండితకుఠారప్రాసఖడ్గార్గళా
రశ్మివ్రాతముతోడ వెల్వడిరి రుద్రక్ర్రూరగాత్రంబునన్
గూశ్మాండాగ్నివతఃపిశాచగణరక్షోభూతవేతాళముల్.

106


క.

ఈవిధమునఁ దనదేహములో వెలువడి వేలు లక్షలుం గోటులు భూ
తావళులు బహుముఖంబులు సేవింపఁగ దక్షమఖవిజిత్వరబుద్ధిన్.

107


సీ.

ధర్మ మక్షంబు నక్తందివములు చక్రములు సవనంబులు మూడు బరము
స్తృతులు పగ్గంబులు మీమాంస కేతువు పురుషార్థములు నాల్గు పూనుగాఁడి
పవమానములు నేమిరవము వేదములు తేజీలు త్రివృత్తులు చెర్లకోల
పరమవిజ్ఞానసంపద కూబరంబు హిరణ్యగరుండు సారథియు నైన
సకలవిద్యావినిర్మితస్యందనంబు, నందుఁ బ్రణవంబు గుణము గాయత్రి కార్ము
కంబు సప్తస్వరంబులు నంబకములు, గాఁగ రుద్రుండు రథికుఁడై కదలైనంత.

108


క.

నిశ్చేష్టితులై మునులు న, భశ్చరులు న్మొదలుగా సభాజనములు చే
తశ్చాంచల్యమునం గడు, నాశ్చర్యము వడఁగ దక్షయాగములోనన్.

109


గీ.

రథికవర్యునిమూర్హ్యంతరంబు గానఁ, దా నతనిఁ గూడె ననఁగఁ గృశానుఁ డాఱె
సారథిముఖంబు సంభవస్థలము గానఁ, దా మతనిఁ గూడె ననఁగ మంత్రము లడంగె.

110


చ.

అవి గని ఋత్విజుల్ విముఖులై సురలార బలోద్ధతుండు దా
నవుఁ డొకఁ డేగుదెంచె సవనంబున భాగము లాహరింప న
న్న విని చలాచలిన్ విబుధనాథులు దక్షునితోడఁ జెప్పినన్
బవరము చేసి తద్దనుజుఁ బట్టుఁడు నావుడు వారు నుగ్రతన్.

111


చ.

వెడవెడ నేర్చుచున్ దిశలు బీఁటలు వాఱ నదల్చి రుద్రుపై
నడచిన నమ్మహారథుఁడు నవ్వుచు భూతపిశాచకోటిఁ జూ
చుడుఁ జని వేయఁ జొచ్చెఁ దపసుల్ ధరణిం బడి బాతళింపఁగా
ముడుసులు గుండ్లు దుండ్లు శవముల్ పుఱియల్ పఱియల్ ముఖస్థలిన్.

112