పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బిచ్చె నది మొదలుగా నాశ్వినేయులకు విదియ ప్రియదివసం బయ్యె నట్టివిదియఁ
బిష్టాహారులై సంవత్సరం బొకటి గడపినవారు సౌందర్యాదిగుణంబుల నాశ్వినేయ
సన్నిభులై జనింతురు నరు లీచరిత్రంబు విన్న దోషనిర్ముక్తులు సుపుత్రయుక్తులు నై
సుఖియింతురు ధరిత్రీకళత్ర యింక వాక్కు గౌరియై జన్మించినవిధంబు వినుము.

97


సీ.

మున్ను సృష్టివిధానమునకు నుపాయంబు గానక కోపించి కమలభవుఁడు
తనకోపమున జనించినరుద్రునకు గౌరి పేరికూర్మికుమారిఁ బెండ్లి సేసె
రుద్రుండు గౌరీసరోరుహపత్రాక్షిఁ గూడి వినోదింపఁ గొంతకాల
మునకు నాబ్రహ్మ రుద్రునిఁ జూచి ప్రజలఁ గల్పింపుము నీ వని పెక్కుమాఱు
లాన తిచ్చిన నాకు మహాతపంబు సలుపక ప్రజావినిర్మాణశక్తి చాల
దనుచుఁ గాండజలంబుల మునుఁగ గౌరితనువు నిజదేహమున దాఁచె ధాత మఱియు.

98


క.

మానసములోన నేడ్వురు, సూనుల నిర్మించె నాఋషులు వసుపశురు
ద్రానిమిషముఖ్యబహుసంతా, నంబులఁ గనిరి దక్షతనయలవలనన్.

99


ఉ.

ఆయెడ నొక్కనాఁడు చతురాస్యుఁడు రుద్రవధూటి గౌరి మ
త్కాయములోన దాఁచుకొనఁగాఁ బనిలేదని దక్షుఁ జూచి వ
త్సా యిది బిడ్డ నీ కని సమర్పణ చేసిన నాఁటనుండి దా
క్షాయణి యై వసించెఁ దదగారమునం గడుగారవంబునన్.

100


క.

భూనాథ యిట్లు గౌరి స, దా నయనోత్సవము సేయఁ దనకూఁతులసం
తానము తామరతంపర, యై నెమ్మది నుండ దక్షుఁ డాహ్లాదమునన్.

101


క.

పులకించి చూచి నాతన, యలయీబలఁగంబు చల్లనై వర్ధిలఁగా
వలె నధ్వరంబు చేసెద, నలినాసనునకు సమర్పణముగా ననుచున్.

102


వ.

కృతనిశ్చయుండై మరీచి బ్రహ్మగా నత్రి బ్రాహ్మణాచ్ఛంసిగా నంగిరసుం డాగ్నీ
ధ్రుండుగాఁ బులస్త్యుండు హోతగాఁ బులహుం డుద్గాతగాఁ గ్రతువు ప్రస్తోతగా
బ్రచేతుండు ప్రతిహర్తగా వసిష్ఠుడు బ్రహ్మణ్యుండుగా సనకాదులు సభాసదులు
గా హిరణ్యగర్భుం డధిదైవతంబుగా నిజదౌహితృ లైనరుద్రాదిత్యాంగిరసప్రము
ఖులు బితృవసుగంధర్వగీర్వాణాదులుం బూజ్యులుగా నాజ్యధారాపరంపరాభి
షేకజాజ్వల్యమానపవమానసఖశిఖాముఖచిటచిటధ్వానంబులు మహేంద్రప్రముఖ
బర్హిర్ముఖాహ్వానంబులు భుజగరాజనిభవచోవిలాసభాజనసజ్జనపరస్పరాలాపంబులు
యాజకస్వాహాస్వధాకారకలకలాటోపంబులు బధిరితదిక్కలాపంబులై కొనసాగ
యాగంబు సాగుచుండ హవిర్భాగంబులు యథాశ్రమంబున సమర్పించు