పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కోహినూర్ వజ్రాన్ని మొదట ఒక ఇనుపపెట్టెలో పెట్టారు. దాన్ని ఒక డిస్పాచ్‌బాక్స్‌లో ఉంచి ప్రభుత్వ ఖజానాలో ఉంచడం జరిగింది. ఇందులో ఏముందో ఇటు ట్రెజరీ అధికారులకు కానీ, అటు ఓడలో షిప్ కాప్టెన్ కమాండర్ లక్కియర్‌కు గాని తెలియనివ్వలేదు. దాన్ని గురించిన రహస్యం తెలిసిన వారిద్దరే - వారు లెఫ్టినెంట్ కల్నల్ మ్యాక్సన్, కెప్టెన్ రాంసే. ఈ అమూల్య వజ్రాన్ని బ్రిటిష్ రాణికి సురక్షితంగా చేర్చే బాధ్యత వారిద్దరికే అప్పగించడమైంది. ప్రయాణంలో ఓడ రెండు సార్లు అనుకోని చిక్కుల నుంచి బయటపడి, కోహినూర్ భద్రత గురించి భయాలు వెంట్రుక వాసిలో తప్పిపోయాయి. ఓడ మారిషస్ దీవిని చేరుకున్నప్పడు ఓడలోని ప్రయాణీకులకు కలరా వ్యాపించింది. అందువల్ల స్థానిక ప్రజలు ఓడ సిబ్బందికి అవసరమైన పదార్ధాలు అమ్మడానికి నిరాకరించారు. రేవు నుంచి ఓడను వెంటనే ఖాళీ చేయమని స్థానిక అధికారులు ఆదేశించారు. ఓడ వెంటనే బయలుదేరకపోయే సరికి ఓడపై కాల్పులు జరిపి, దాన్ని ధ్వంసం చేయడానికి అనుమతించవలసిందిగా గవర్నర్‌ను కోరారు. ఆ పరిస్థితుల్లో మారిషస్ ను వదిలిన "మీడియా"కు కొన్ని రోజుల్లోనే మరో ప్రమాదం ఎదురైంది. సముద్రంలో ప్రచండమైన ఝంఝామారుతం చెలరేగి, పన్నెండు గంటల పాటు నానా బీభత్సం సృష్టించింది. ఇబ్బందులన్నీ అధిగమించి, ఓడ ఇంగ్లాండ్‌లోని ఫ్లెమౌత్ రేవుకు చేరుకుంది. అక్కడ ప్రయాణీకులను, మెయిల్ను దింపివేశారు. కానీ కోహినూర్‌ను మాత్రం దింపలేదు. దాన్ని పోర్టుమౌత్‌లో దింపారు. అక్కడి నుంచి కోహినూర్‌ను ఈ ఇద్దరు అధికారులు ఈస్టిండియా హౌస్‌కు తీసుకువెళ్ళి, కంపెనీ చైర్మన్‌కు, డిప్యూటీ ఛైర్మన్‌కు దాన్ని అప్పగించారు. కంపెనీ డిప్యూటీ ఛైర్మన్, బకింగ్హాం పాలెస్‌లో కోహినూర్‌ను 1850 జూలై 3వ తేదీన విక్టోరియా మహారాణికి అందజేశాడు.

లండన్‌లోని హైడ్ పార్క్లో ఏర్పాటుచేసిన గ్రేట్ ఎగ్జిబిషన్‌లో కోహినూర్ వజ్రాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచారు. మొత్తం ఎగ్జిబిషన్ కంతటికి కోహినూరే పెద్ద ఆకర్షణగా మారి ప్రజలు దీన్ని చూడటానికి తండోప

48