పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ వజ్రాన్ని బ్రిటిష్ మహారాణికి పంపడానికి అన్ని ఏర్పాట్ల చకచకా జరిగి పోయాయి. మొదట కోహినూరును లాహోరు నుంచి బొంబాయికి తరలించారు. దారి పొడుగునా దొంగలు, దోపిడిదార్లు ఉన్న ఆ రోజుల్లో ఈ పనే ఎంతో కష్టసాధ్యమయింది. దానిని అద్వితీయమైన రత్నంగా కొనియాడిన గరవ్నర్ జనరల్ డల్హౌసీ స్వయంగా ఈ పనికి పూనుకొని, కోహినూరును లండన్‌కుభద్రంగా పంపడానికి వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నాడు. 1850 మే 16న డల్హౌసీ ఈ విధంగా వ్రాశాడు.

"బొంబాయి నుంచి కోహినూరు 'హెచ్.యం.యస్. - విూడియా" అన్న ఓడలో ఏప్రిల్ 16న బయలుదేరింది. దీన్ని లాహోరు నుంచి ఎంత రహస్యంగా బొంబాయికి తీసుకురావలసి వచ్చిందంటే, నేనే స్వయంగా నా చేతులతో ఈ పని చేశాను. దీన్ని తెచ్చి బొంబాయిలోని ట్రెజరీలో భద్రపరిచే వరకు నేననుభవించిన ఆందోళన అంతకు ముందెప్పడూ నా జీవితంలో లేదు. దాన్ని ట్రెజరీలో భద్రపరిచిన పిమ్మట నా ఆనందానికి అవధుల్లేవు. ఎంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. నా నడుముకు కట్టుకున్న బెల్టుకు కోహినూర్ వజ్రం ఉన్న పెట్టెను పెట్టిన సంచిని ఒకటికి రెండు సార్లు గట్టిగా కుట్టాను. ఆ బెల్లు ఒక చివరను ఒక గొలుసుతో నా మెడకు బంధించాను. రాత్రి - పగలు తేడా లేకుండా దాన్ని నా ఒంటికి అలాగే ఉంచుకున్నాను. నా అదృష్టం బాగుండి, దాన్ని భద్రంగా ఘాజీఖాన్‌తో కలిసి, కాప్టెన్ రాంసేకు అందజేసి, అతను దాన్ని ట్రెజర్ ఛెస్ట్‌లో భద్రపరచడం స్వయంగా వీక్షించి, బయటకు వచ్చి కుదుటపడ్డాను. దాన్ని వదలించుకుని ఎంతో రిలీఫ్ పొందాను. బొంబాయిలో దీన్ని రెండు నెలలపాటు ఓడ అందుబాటులో లేక ఉంచాల్సి వచ్చింది, అది జూలై నాటికి భద్రంగా మహారాణీ వారికి చేరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. దీనిని ఆధికారికంగా అధికారగణానికి, మహారాణీ వారికి మెయిల్ ద్వారా తెలియజేసుకున్నాను".

దీన్ని లండన్‌కు తరలించడానిక ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

47