పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బహూకరించాడు. అందులో "బాబరు వజ్రం" కూడా ఒకటని అంటారు. ఈస్టిండియా కంపెనీ ఏజెంటు ఒకరు విూర్ జుమ్లా 160 రతులున్న అమూల్య వజ్రాన్ని షాజహానుకు కానుకగా ఇచ్చాడని వ్రాశాడు.

మరొక అభిప్రాయం ప్రకారం గోల్కొండ మంత్రిగా ఉండి స్వతంత్ర ప్రభువైన విూర్ జుమ్లా ఔరంగజేబుకు స్నేహితుడైనాడు. ఈ విూర్ జుమ్లా ఆహ్వానం విూదే ఔరంగజేబు దక్షిణ దిగ్విజయ యాత్రను చేపట్టి కృతకృత్యుడైనాడు. ఔరంగజేబు చక్రవర్తికి విూర్ జుమ్లా, నమ్మినబంటుగా వుండి, ఆయనకు సేనాధిపతిగా, రాజప్రతినిధిగా చరిత్రపుటలకెక్కాడు. అహ్మద్‌నగర్ నవాబు నుంచి ఈ బాబరు వజ్రాన్ని విూర్ జుమ్లా చేజిక్కించుకుని, మెప్పు కోసం ఔరంగజేబుకు కానుకగా ఇచ్చాడు.

క్రీ.శ. 1638-1662 మధ్య ఆరుసార్లు తూర్పుదేశాలలో సంచరించిన టెవర్నియర్ అనే ఫ్రెంచి వర్తకుడు ఈ విషయం వ్రాస్తూ సానబట్టని స్థితిలో 900 రతులు లేక 787 క్యారట్ల తూనికగల ఒక గొప్ప వజ్రం కొల్లూరులో దొరికిందని, దానిని విూర్ జుమ్లా 1656-57 మధ్య షాజహాను చక్రవర్తికి సమర్పించాడని పేర్కొన్నాడు.

1707లో ఔరంగజేబు చక్రవర్తి చనిపోయే నాటికి మొగలాయి సామ్రాజ్యం మహోన్నత స్థితిలో ఉంది. షాజహాను చేయించిన అమూల్యమైన మయూర సింహాసనంతో పాటు, రత్నఖచితమైన ఇంకా తొమ్మిది సింహాసనాలు, అమూల్యమైన రత్నరాసులు, ధనకనక వస్తు వాహనాలతో పాటు అపూర్వమైన బాబరు వజ్రం ఖజానాలో వున్నాయి.

ఔరంగజేబు తదనంతర మొగలు చక్రవరులు బలహీనులు, భోగలాలసులు. అందువల్ల సామ్రాజ్య ప్రాభవం సన్నగిల్లడం ప్రారంభమైంది. 13 సంవత్సరాలలో ఆరుగురు పాలకులు మారారు. అందరూ అసహజ మరణాలకు గురైనవారే. చక్రవర్తులు బలహీనులు కావడంతో సామ్రాజ్యం

43