పుట:రేఫఱకారనిర్ణయము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేఫఱకారనిర్ణయము

435


క.

కొఱమాలి కొఱత వడినను, గఱవుం గొఱ గాదు కొఱవి కాఱియఁ బెట్టన్
కఱదిం దెలుపఁగఁ గాదనఁ, గఱకంఠా యనిన ఱాలగని యగుఁ గృష్ణా.

12


క.

కుఱుగలి యనఁ జేర్పనఁ బడుఁ, గొఱలుట యనఁ బూర్ణ మగుట కోఱలు వచ్చెన్
గఱకు లనఁ బ్రల్లదములు, క్కెఱ యనఁగాఁ బెద్దఱాలు గీల్కొనెఁ గృష్ణా.

13


క.

కుఱుచనఁ గాఱెడు ననఁగాఁ, గొఱపము కాఱడవి కొఱడు కుఱుమా పనఁగాఁ
గొఱ గలవాఁ డితఁ డనఁగా, గుఱకుఱ యనఁ బెద్దఱాల గుణములు కృష్ణా.

14


క.

కఱ లేని కందుచే కుఱుఁ, గఱు కెక్కినపింజ వింజ గఱచి కొఱుకుటల్
కఱ కనఁగాఁ గఠినంబగుఁ, గఱకఱి యనఁ బెద్దఱాలగతు లివి కృష్ణా.

15


క.

గిఱుపుట గుఱుకొని గొఱియల, గిఱిగొనఁ గన్గిఱిపి పగఱ గీఱినగుఱుతున్
గుఱియు గగుఱుమలు గింజలు, గఱిగుఱుకలు పెద్దఱాలకైవడి కృష్ణా!

16


క.

గిఱుఁ జెప్పులతో డగ్గఱి, గుఱిచి యనఁగఁ గూర్చి యనుట గుఱుగుఱ్ఱనుచున్
గుఱుపెట్టుచు నిద్రింపఁగ, గఱు లనఁగాఁ బెద్దఱాలకైవడి కృష్ణా.

17


క.

చెఱుచు నది యనఁగఁ గ్రచ్చఱ, చఱు కనఁ బెడచేతఁ జఱచు చఱిఁ జిఱుముట చి
చ్చుఱపిడుగై చుఱచుఱ జి, చ్చఱకంట ననంగ ఱాలు సమకొనెఁ గృష్ణా.

18


క.

చెఱ నునుచుట చెఱు నమయుట, చుఱుపుచ్చుట చెఱకు విల్లు చూఱ విడుచుటల్
చిఱునగవు చిఱుత తనమును, జెఱుతట యన ఱాలు భువిని జెల్లును గృష్ణా.

19


క.

చఱిగొనె ననఁ జలమగు ము, చ్చిఱుట య ముచ్చటయుఁ జెఱఁగు చీఱుట యనవా
చఱచి యిలఁ జఱచి పాఱుట, చెఱిసగమనఁ బెద్దఱాలు చేకొనెఁ గృష్ణా.

20


క.

జఱిగొని యొకచో జాజఱ, జఱజఱ నొకజెఱ్ఱిపోతు జాఱె ననంగా
జఱుపుచ్చ జఱచి జొఱజొఱ, జిఱజిఱ యనఁ బెద్దఱాలు చెలువుగఁ గృష్ణా.

21


క.

తఱిగొని నడవఁగ దఱుముచు, దొఱఁగువడుట తొఱఁగె ననుట తూఱుచుఁ బనులన్
దొఱఁగులు వోయెడి దఱుముఁడు, తొఱుఁగుట పడుఁ డనుట ఱాలు దూకొనెఁ గృష్ణా.

22


క.

తఱియగుఁ దఱ చగునత్తఱి, తెఱవలు వాతెఱలు దెఱచి తెఱపి గనుట యే
డ్తెఱ దోఁపఁ దెఱఁగు గలుగుచుఁ, దెఱఁ గేది యనంగ ఱాలు చెల్లమి కృష్ణా.

23


క.

తెఱగినతావియు నిడుమల, తొఱగమిఁ గడుఁ దుఱగలింపఁ దుదఁగలుపంబున్
దఱుగుట తీఱమి తాఱుట, తఱులన విలసిల్లె ఱాలు తప్పవు కృష్ణా.

24


క.

తుఱుము తుఱిగొనియె ననఁగాఁ, తఱిగె ననఁగఁ దక్కువనుట తలపోయంగాఁ
దఱి కొలిపి తిఱికనుంగొనఁ, దఱుమఱ యనఁ బెద్దఱాలు తలకొనె గృష్ణా.

25