పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఇంతిరొ యింతచింత మది నేటికి నేఁటికిఁ జూడు శౌరి రే
పెంతయు సంతసం బలర నెల్లజనుల్ వినుతింప మేదినీ
కాంతులఁ బాఱఁదోలి నినుఁ గైకొనుఁ బైకొని యోడి ఖిన్నులై
పంతము వీడి రుక్మిశిశుపాలజరాసుతు లిండ్లు దూఱఁగన్.

95


క.

మోహావేశంబున నటు, లాహా యాహార ముడిగి హాహా యనుచున్
నీహారకరముఖీ ఘన, సాహసవృత్తి న్మెలంగఁ జాడయె నీకున్.

96


చ.

అలరెడురాజనందనుల నాత్మగతంబునఁ గోరి కేరి మున్
నిలచినవారు లేరొ యిటువంటివి గంటిమె యెందునైన నీ
వలన బళా బళా తెలిసి వచ్చెను వింత లొకింత యిప్పు డో
కులుకుమిటారి చిత్తమునఁ గోపముఁ గల్గినఁ గల్గని మ్మిఁకన్.

97


క.

చీటికిమాటికి నేటికి, సాటికిఁ బాటిలెడుతోడిసకియలపైఁ గో
పాటోపము చూపెదవు వ, ధూటీ యిటు దగునె యెంతదొరతనమైనన్.

98


ఉ.

వంచనతోడ నూడిగపువారిజగంధులు చేరి సేవగా
వించ గణంగినం బరిభవించి సళించుదు ముందు పొందుగాఁ
బెంచినరాజహంసశుకబృందములన్ బెదరించే దేటి కో
చంచలనేత్ర నీవలపుచందము లెంచఁగఁ జిత్ర మియ్యెడన్.

99


ఉ.

నాన వహింప కిట్లు దగునా నవసూనశరానలార్తి లో
నానఁగ మానరానితమి నానగధారిఁ దలంచి చెల్లఁబో
దీనగతిం గృశింప వెలఁదీ నగరే నగరి న్మఱి న్మఱిన్
మానినులెల్ల నెంచుకొనుమా నిను మాటికిఁ బల్క నేటికిన్.

100


సీ.

జలకంబు లాడనిచులుకఁదనం బేమి గంధంబు పూయనిచంద మేమి
తొడులు దొడుగనియుడుగనిచల మేమి తిలకంబు దిద్దనికఁక యేమి
ముకుుంబుఁ జూడనివికలభాసం బేమి విరిసరుల్ దాల్పనివరుస యేమి
పెన్నెఱుల్ దువ్వనివిన్నఁదనం బేమి యాహార మొల్లనియూహ యేమి


తే.

రామ యీరీతి వర్తింపరాదు నీదు, కోర్కు లేడేఱు నందునికొడుకు రేపె
యేపుతోఁ జెలి ని స్వరియించు నించు, కైన మదిలోన సంశయం బందవలదు.

101


చ.

సొలయక కూడి వేడుకల శోభిలి జాబిలిరాలమేడలోఁ
దళుకుఁబసిండిజీనిపనితల్పముపై వసియించి నీవునుం
జెలువుఁడు సారెసారెకును జిత్రవిలాసములన్ మెలంగుచోఁ
దలఁతువొ లేదొ మ మ్మపుడు తామరసాక్షి నిజంబుఁ దెల్పుమా.

102


క.

అని యనుఁగుఁజెలులు పలికిన, విని వనరుహనయన వినయవినమితముఖి యై
ఘనతరలజ్జాభరమునఁ, దనమది నూఱడిలి యుండె తమి నిగుడంగన్.

103