పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అంత వసంత మనంతల, తాంతనితాంతాళిపికశుకాదిశకుంతా
క్రాంతవనాంతరమై జగ, మంతయు సంతసిల నలరె నభినవలీలన్.

104


సీ.

ఘనసారకేతకీపనసారవిందాదివనసారసౌరభ్యవాసితంబు
సురసాలతులితామితరసాలఫలలోలసరసాలపనశీలవరశుకంబు
సుమనోరసాస్వాదనమనోరథాత్యాశుగమనోరరీకృతభ్రమరకంబు
సుకరావయవచారుపికరావహృతపా౦థనికరావలేపాత్మనిశ్చలంబు


తే.

మదనకదనక్రియార్హతమప్రసూన, మంజరీమంజుమాధవీకుంజపుంజ
సంజవనరంజితాఖండకంజజాండ, మండలంబు వసంతాగమంబు దనరె.

105


క.

పెళపెళలాడెడుకారా, కులు జలజల డులిచి చింతకొమరు దలిర్పన్
మిలమిలలాడెడుకెంజివు, రులతోఁ బొలుపారె భూమిరుహనివహంబుల్.

106


చ.

సరసగతిం జగిర్చిన విశాలరసాలలతావితానముల్
మెఱసె వసంతుఁ డాదరము మీఱ వనేందిరఁ బెండ్లి యౌటకున్
సురుచిరలీలఁ జేరు ననుచున్ సమయాఖిలకార్యదక్షుఁ డ
త్తఱి నలరింపఁజేయు వితతం బగుకెంజిగిమేలుక ట్లనన్.

107


తే.

దట్టముగఁ బూచి శాల్మలీతరువు లమరె, విరహిణుల నేఁచ వాహ్యాళి వెడలఁదలఁచి
యలరఁ జేసినధాతురాగారుణితము, లగుమనోజునిమదపుటేనుఁగు లనంగ.

108


తే.

వనరమాధవోద్వాహవైభవమున, కింపుఁ దళుకొత్తఁ గ్రొత్తఁగా నేర్చి యిడిన
మేలితెలిముత్తియపుసేసఁబ్రా లనంగ, మొనసి యున్నట్టె జిగిమల్లెమొగ్గ లమర.

109


క.

నన లెత్తినకింశుకములు, దనరెన్ మాధవుఁడు వలవు దళుకొత్తంగా
వనలక్ష్మికిఁ గానుక లి, చ్చిన నునుఁగెంజాయపట్టుచీర లనంగన్.

110


తే.

రమణఁ బున్నాగమహిళలు సుమకదంబ, లీలలఁ జెలంగఁ బొంగి యవ్వేళయందుఁ
బుష్పవతి యయ్యు మిగులు నేపునఁ గుమారి, విటపపరిరంభవృత్తిచే వెలసె గణిక.

111


క.

చిగురాకు మెక్కి మిక్కిలి, పొగరెక్కి రసాలసాలములపైఁ బికముల్
తగ నిక్కి చొక్కి పాంథుల, కగణితముగ గుండె జల్లురన వడిఁ గూసెన్.

112


క.

ఎక్కడఁ జూచిన శారిక లెక్కడఁ జూచినఁ బికంబు లెడ మింతయు లే
కెక్కడఁ జూచినఁ దుమ్మెద, లెక్కడఁ జూచినను కంబు లిలఁ జెలరేఁగన్.

113


సీ.

సుందరశుకరాజవందిబృందంబులు కలకంఠవరకంఠకాహళములు
వికచతిరీటప్రవిమలాతపత్రముల్ సహకారమంజరీచామరములు
లాలితాశ్వత్థపల్లవకేతనంబులు మత్తసషట్పదగాయకోత్తములును
భవ్యప్రసకవకుంజపటకుటీరంబులు సంఫుల్లచంపకస్వర్ణరథము


తే.

అతులతరకేతకీదళోగ్రాయుధములు, నలర బలయుతుఁడై మనోజావనీశుఁ
డేపుతోఁ బాంధవీతతుల నేఁచఁ బూని,ని హర్ష మిగురొత్త నపుడు వాహ్యళి వెడలె.

114