Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

రామాయణ విశేషములు

నుదాహరించుచున్నాను. జైన హేమచంద్రుడు పై గ్రంథములో రామాయణకథ నిచ్చినాడు. ఆ కథ వాల్మీకి రామాయణముతో ముఖ్యవిషయాలలో భిన్నించుచున్నది. అందుచేత భిన్నించిన విషయాలను చేర్చి దాని నిచ్చట వ్రాయుచున్నాను. భిన్నించని విషయాలు వ్రాయలేదు. అవి రెంటను ఒకటేరీతిగా నున్నవని గ్రహింపనగును.

జైనకథ - రాక్షస వానరోత్పత్తి '1

భరతఖండ మందలి వినీత పట్టణమున ఇక్ష్వాకువంశీయుడయిన సగర చక్రవర్తి రాజ్యము చేయుచుండెను. అతడొకనాడు వేట కరిగి బాటతప్పి యలసియుండెను. అప్పుడరణ్యమం దతడొక సుందరిని సుకేశ యనుదానిని జూచెను. ఇరువురు పరస్పరము మోహించిరి. అప్పుడొకడు వచ్చి యా సగరునితో నిట్లు చెప్పెను: "అయ్యా! విద్యాధరులలో నొకడయిన సులోచనుడను రాజు గగనవల్లభాపట్టణము నేలుచుండెను. అతనికి సహస్రనేత్రు డను కుమారుడును, సుకేశ యను కూతురును కలరు. రదనపురాధీశ్వరుడైన పూర్ణమేఘు డనువాడు సుకేశనుగోరియు నభీష్టము నెరవేరనందున సులోచనుని జంపి రాజ్యమపహరించెను. ఇప్పుడు సహస్రనేత్రుడును తన చెల్లెలగు సుకేశయు నీ యరణ్యమున దాగియున్నారు. తాము సుకేశను పరిగ్రహించ నర్హులు.”

అదే ప్రకారము సగరుడు సుకేశను పెండ్లియాడి సైన్యయుక్తుడై పూర్ణమేఘుని పారద్రోలి తన మఱదిని రదన పురమునేల నియోగించెను. కొంతకాలమునకీ బావమఱదులు తీర్థయాత్రచేయుచుండ పూర్ణ మేఘుడు వీరికెదురుకాగా సహస్రనేత్రు డతని జంపెను. పూర్ణమేఘుని కొడుకు ఘనవాహనుడు. భీముడను రాక్షసరా జతని జూచి "అయ్యా! నీవు నాకు పూర్వజన్మమున పుత్రుడవు, నా కాలము సమీపించినది. కావున నీకు నా నవ వజ్రముల హారమును నిచ్చితిని. నీవు రాక్షసద్వీపమందలి నా లంకాపట్టణమగు పాతాళలంకకు పరిపాలకుడవు కమ్ము" అని