Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

రామాయణ విశేషములు

మెనిలాసు తిరిగివచ్చి తనభార్య లేచిపోయిన వార్త విని తన కపచారము చేసిన ప్యారిసుపై పగ సాధించుటకును తన హెలెనును మరల తెచ్చుకొనుటకును ఇతర గ్రీకు రాజులకు జాబులు వ్రాసి పిలిపించు కొనెను. వారిలో ముఖ్యులు యులిసిస్, ఆకిల్లీ అనువారు. ఈ సైన్యానికి నాయకుడు మెనిలాస్ అన్నయగు అగమెమ్నాన్. (గ్రీకు భాషలో అగమెమ్నాన్ అంటే మనుష్యులలో ఉత్తముడు అనగా "అగ్రమానవ” అను పదమును పోలిన నామము.) వీరందరును ఓడలలో పోయి ట్రాయిని ముట్టడివేసిరి. పదియేండ్లపాటు యుద్ధము జరిగెను. ఉభయత్ర మహా వీరులు చాలా మంది చనిపోయిరి. ఈ యుద్ధములో ప్యారిసు అన్నయగు హెక్టరునకున్ను గ్రీకులలో మహావీరుడయిన ఆకిల్లీసునకున్నూ జరిగిన యుద్ధము ముఖ్యమైనది ఎట్లయితేనేమి ఉభయులును చచ్చిరి. ఈ పదేండ్ల కాలములో ప్యారిసు ఎడతెగకుండా హెలెనుతో భోగా లనుభవించుచు తుదకు తానును యుద్ధము చేసి రణరంగ మందు మరణించెను. కాని ఇంతకునూ ట్రాయి గ్రీకుల వశము కాకపోయెను. గ్రీకులు ఒక యుక్తిని పన్నిరి. ఒక గొప్ప కట్టె గుర్రాన్ని చేసిరి. దాని కడుపులో మహావీరులు దాగియుండిరి. దాన్ని దిగతుడుపుగా అచ్చట వదలి తమ ఓడలలో ఎక్కి వెళ్ళిపోయిరి. ట్రాయివారు గ్రీకులు పారిపోయిరని కోటబయటకువచ్చి ఆ కట్టెగుర్రాన్ని ఊరిలో ఊరేగింపుతో ఉత్సవాలు చేసి రాత్రి మైమరచి నిద్రించిరి. తర్వాత గుర్రములోనివారు బయటకు వచ్చి కోట తలుపులు తెరిచిరి. పోయినట్లు నటించి ఆ రాత్రియే తిరిగి వచ్చిన గ్రీకులు లోపలికి ప్రవేశించి నగరాన్ని దగ్ధముచేసి జనులను చంపిరి. హెలెనును మెనిలాసు తీసుకొనిపోయెను.

ఇది హోమరు వ్రాసిన ఇలియడు కథ. హోమరు పాత్రలలో ఉత్తమత్వము లేదు. హెలెను పరకీయ. ప్యారిసు అతిథి సత్కారాన్ని పొందినవాడు. దాని కుపకృతిగా హెలెనును లేవ నెత్తుకొనిపోవును.