Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ విశేషములు

13

పుట్టిన కొంతకాలానికి వానిని ఇళా అను పర్వతాలలో వదలివేసిరి. వానిని గొల్లలు పెంచిరి. ప్యారిస్ పసులు మేపుచు పెద్దవాడై మంచి తగవుతీర్పరి యని యనిపించుకొనెను. ఇట్లుండ గ్రీసులోని భాగమగు థెసలీ దేశము యొక్క రాజు పెండ్లాడెను. ఆ పెండ్లికి దేవతలుకూడ ఆహూతులైరి. కాని కలహదేవతను మాత్రము పిలువలేదు. ఆమె పెండ్లిసందడిలో కల్పించుకొని సభలో ఒక బంగారు సేపుపండును పారవేసి “అందరిలో సుందరియైన స్త్రీయే దీని కర్హురాలు" అని చెప్పిపోయెను. ఇంకేమున్నది? నేనే సుందరిని, నేనే జగదేకమోహినిని అని దేవతలంతా తగవులాడిరి. తుది పరీక్షలో ముగ్గురు దేవతలే నిలిచిరి. ఆ ముగ్గురును అసమాన సుందరాంగులే తుదకు వీరు ప్యారిసువద్దకు వెళ్ళి తీర్పు చెప్పుమనిరి. ప్యారిసు వారిని ఎగ దిగ చూచుచు పరీక్షించుచు ఏ నిర్ణయము చేయజాలక తర్కసాగరములో మున్కలు కొట్టదొడగెను. అప్పుడు ఒక దేవత నన్నే నీవు మెచ్చుకొంటివా నీకు సామ్రాజ్యమిప్పింతు ననెను. ఇంకొకతె విద్య నిత్తుననెను. వీనసు అను దేవత "నీకు భువనమోహిని యగు చక్కెరబొమ్మ నిప్పింతు”ననెను. ప్యారిసుకు నోరూరెను. వీనసే అందరిలో సుందరాంగి యని వెంటనే నిర్ణయము చేసివేసెను. కొంతకాలానికి ప్యారీసు యొక్క యస్తిత్వ మాతని తండ్రికి తెలిసి వానిని ట్రాయికి పిలిపించుకొనెను. ప్యారిసు అచ్చటినుండి వీనసు ప్రేరితుడై స్పార్టా అను గ్రీకుదేశ భాగముయొక్క రాజైన మెనిలాస్ అనువాని నగరానికిపోయెను. మెనిలాస్ చాలా ప్రేమతో అతని కాతిథ్య మిచ్చెను. మెనిలాస్ భార్యపేరు హెలెస్ (హాలీ). ఆమెయే భువనమోహిని. హెలెనున్నూ ప్యారిసున్నూ పరస్పరము గాఢముగా ప్రేమించుకొనిరి. ఇంతలో మెనిలాసు పనిబడి దేశాంతరము వెళ్ళెను. అతడు వచ్చులోపల ప్యారిసు హెలెనును ఒప్పించి మెప్పించి తనవెంట లేవదీసుకొని వెళ్లెను. ట్రాయిలో ఇరువురుసు భార్యాభర్తలవలె సుఖముగా ఆనందాలలో ఓల లాడుచుండిరి.