Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

రామాయణ విశేషములు

రచితములో యేమో? నాల్గవ సర్గ మొదటి శ్లోకములో "వాల్మీకిర్భగవాన్ ఋషిః" అని యుండుటచే అదియు వాల్మీకిది కాదేమో? వాల్మీకి రాముని సమకాలికుడో కాడో సంశయాస్పదమే. “చిరనిర్వృత్తమప్యేత త్ప్రత్యక్ష మివదర్శితం"(బా. 4-18) . చాలా కాలము క్రిందటి సంఘటనలైనను వాటిని ప్రత్యక్షముగా చూచినట్లు వాల్మీకి వ్రాసెనని వర్ణించినారు. ఇక బాలకాండలోని అయిదవ సర్గమును గనుడు. “తదిదం వర్తయిష్యామి సర్వం"(బా. 5-4) అని ప్రారంభించుచున్నాడు. “ఇక ఈ రామాయణ కథను పూర్తిగా వివరిస్తాను వినండి” అంటున్నాడు వాల్మీకి. వాల్మీకిరచన బాలకాండ అయిదవ సర్గతో ప్రారంభమగునని తలతును. కథా ప్రారంభము చక్కగా మొదలై సూటిగా సాగినది.

రామాయణ ప్రాశస్త్యము


హిందువులకు రామాయణమన్న నెంత గౌరవమున్నదో అంత గౌరవము మరే గ్రంథానికిని లేదని తెలిపినాను. భారతదేశమందలి సర్వ భాషలను మాట్లాడు హిందూ కవులందరును మొదట వాల్మీకికి నమస్కారము చేయనిది కవిత్వ మారంభించినవారు కారు. కేవల సంస్కృత సాహిత్యము నందే కాక దేశభాషలలోని కవితలందును వాల్మీకిస్మరణ అగ్రస్థానము వహించినట్టిదై యున్నది. సంస్కృత మహాకవులందరును వాల్మీకి రామాయణమును చదువనిది తమ సాహిత్య విద్య పూర్తికాదని పూర్వ కాలములో భావించుచుండినట్లు కనబడుచున్నది. పూర్వకాలములోవాల్మీకి రామాయణములోని కొన్ని భాగాలను శిష్యులకు చదువు చెప్పిన తర్వాత తక్కిన పంచకావ్యాదులను చెప్పుచుండిరని ప్రతీతి. ఇప్పుడైనను వాల్మీకి రామాయణములోని కొన్ని ముఖ్యభాగములను విద్యార్థులకుచెప్పి తర్వాత రఘువంశాదులను ప్రారంభించిన బాగుండును. కాళిదాసాది మహాకవులందరు వాల్మీకి కవితను ఆదర్శముగా పెట్టుకొని తమగ్రంథాలను రచించినట్లు అనేక నిదర్శనాలు కలవు.