Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ విశేషములు

11

ఇంచుమించు 200 సంవత్సరాలనుండి ముఖ్యమగు యూరోపు భాషలలో ఇంగ్లీషుద్వారా రామాయణకథ పరివర్తనమునుపొంది పాశ్చాత్యులకు పరిచితమైపోయినది కాని మొదటి భాషాంతరీకరణములు సంగ్రహమైనవగుటచేతను సంస్కృత భాషలోని రమ్యత తెలియనివారిచే వ్రాయబడి అట్టివారిచే చదువబడినవగుటచేతను పాశ్చాత్యులకు రామాయణ ప్రాశస్త్యము కానరాకపోయెను. పైగా చాలామంది పాశ్చాత్యులు మొదటినుండియు సంకుచిత దుర్ర్భమకు లోనై నట్టివారు. తమ సాహిత్యము, సంస్కృతి, గ్రీకు, లాటిను భాషలనుండియే వచ్చినవని వారి భావనయై యుండెను. గ్రీకు లాటినులలో వ్రాయబడినవాటికన్న మించిన ప్రాచీన గ్రంథాలు ఏ యితర ప్రపంచ భాషలలోను లేవను సిద్ధాంతము వారిలో దృఢపడిపోయి యుండెను. హోమర్ అను గ్రీక్ ప్రాచీనకవి వ్రాసిన ఇలియడ్, ఒడెస్సి అను పురాణాలే ఉత్తమ పురాణాలని వారు భావించిరి. కాని హోమరు గ్రంథముకన్న మూడురెట్లకన్న అధికమయిన రామాయణము, ఇంచుమించు 15 రెట్లకన్న అధికమయిన

మహాభారతము ఉన్నవని వారికి తెలిసినపుడు వారు దిగ్ర్భమ చెందిరి.[1] కాని తమ పూర్వాభిమానములను చంపుకొనలేక ఆర్యులీ పురాణాలను గ్రీకులనుండియే సంగ్రహించి యుందురని వాదించిరి. హోమరు వ్రాసిన ఇలియడ్ కథకును రామాయణకథకును చాలా పోలికలున్నవి. అందుచేత రామాయణము హోమరు యొక్క ఇలియడ్ నుండి దొంగిలించిన పురాణమే అని పలువురు వ్రాసిరి. ఎవరు దొంగలో ఎవరు దొరలో ఇప్పుడే నిర్ణయించుకొందము. ఇంతలో ఈ రామాయణప్రాశస్త్య ప్రశంసాసూచనను ముగించి తర్వాత ఆ చర్చకు వత్తును.

  1. మహాభారతములో 2,20,000 పంక్తులున్ను, రామాయణములో 48,000 పంక్తులున్ను, ఇలియడ్‌లో 15,693 పంక్తులున్ను కలవు.