Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxii

( ప్రసిద్ధ తిమ్మకవియొక్క పౌత్రుడు) తన రామాయణ విమర్శనమునఁ జెప్పియున్నాడు. కింపురుష శబ్దమునకు తైత్తిరీయ బ్రాహ్మణమున ఆటవికులకు సంగీతమునుబాడి జీవించువాడు అను నర్థము గలదు. (చూ. సున్నాలపన్నము) వానరాది పై శబ్దములు వికల్పనరుడు కుత్సితనరుడు అను నర్థము నిచ్చునుగదా!

ఆర్యావర్త, ఏకవేణిశబ్దములగూర్చి శ్రీ చిదిరెమఠం వీరభద్రశర్మగారు భిన్నాభిప్రాయమిచ్చియున్నారు. ఆర్యావర్తమన నొకప్పుడు టైగ్రీసు (శరావతి) వరకు పాటలీపుత్రము మొదలు వ్యాపించియే యున్నదని నాయొక్క యభిప్రాయమునై యున్నది. వేదమునందు పవిత్రదేశముగా వర్ణింపబడిన గాంధారము (Kandhahar) నేటి యార్యావర్తములోని దనదగునా? వేదములో నపవిత్రదేశముగా చెప్పబడిన కీకటము (మధ్యగయా ప్రదేశము) నేడు పవిత్రదేశమేకదా! ఆర్యావర్త సంజ్ఞ నేడు భిన్న రూపముననే యున్నది. ఇప్పటి యార్యావర్తముయొక్క పటమును మహా మహోపాధ్యాయ శివదత్తశర్మ లాహోరు సంస్కృత కళాశాలాధ్యక్షుడు తాను ప్రకటించిన పతంజలి భాష్యముయొక్క పీఠికలో జిత్రించియున్నాడు. దేశసీమలు వేరువేరు కాలములలో ప్రభుత్వము ననుసరించి మారుట సహజమే. ఏకవేణిశబ్దమునకు జటకట్టిన కేశపాశముకలదియని యర్థము. ప్రోషితభర్తృక కేశ సంస్కారమును చేసికొనరాదని పతివ్రతాధర్మములలో గలదు. కేశపాశమును ద్విధా విభాగించి ముడిచికొనుట స్త్రీలకు నశ్వమేధకాలమున మేధాశ్వమునకు జేయు పరిచర్యలో మాత్రమె కలదని శ్రీమద్రామాయణముయొక్క బాలకాండ 14 సర్గ. వ్యాఖ్యలో జర్చింపబడియున్నది. పురుషుడు కేశపాశమును రెండుగా విభజించి ముడుచుకొనుట పితృమేధ సమయముననే. ప్రాచీనకాలమునుండి నేటివరకు సనాతన ధర్మిష్ఠలగు స్త్రీలు కబరీభారయుక్తలు. ఆ కొప్పు పెట్టుకొనుటలో ఆర్యద్రావిడాంగనలకు భిన్న రూపములు కలవు.