xxi
శ్రీ రాజారామమోహనరాయలవారు తమ పార్లమెంటు సాక్ష్యములో జెప్పిరి. శ్రీ వివేకానంద స్వాములవారు ప్రాక్పశ్చిమములు (East and West) అను గ్రంథమున భారతీయులు దాస్యవిమోచనము నొందువరకు మత్స్యమాంస భక్షణము విధిగా జేయవలయునని ప్రోత్సహించి యున్నారు. అమాంసభుక్కులగు నాంధ్రాది పంచద్రావిడులకుఁ బై వాక్యములన్నియును నే డసహ్యకరములును నాశ్చర్యకరములుగా నుండునుగదా!
రామాణమునందలి పరశురాముడు భారతములో భీష్మునితో బోరాడుట విచిత్రాంశము. బ్రహ్మాండ పురాణములో పరశురాముడు శ్రీకృష్ణునికై తపస్సు చేసి వరములనొందియే క్షత్రియ సంహారమునకు గడంగెనని కలదు. ఇదెట్టి విచిత్రాంశమో! వైదిక వాఙ్మయమున ఋగ్వేదమున మాత్రమే రాముని ప్రశంస కలదు. అతడు శ్రీరాముడే యనదగు. పరశురామ బలరాములు పేరులు గాన్పింపవు. కాని ఐతరేయ బ్రాహ్మణమున మార్గవేయరాముడను నొక ఋషి కాన్పించుచున్నాడు. కాశ్యపులైన బ్రాహ్మణులు 'శ్యాపర్ణి' మహారాజు యొక్క యజ్ఞశాలకుం బోయి సోమపానముంజేయ సిద్ధపడగా శ్యాపర్ణి యాబ్రాహ్మణులను యజ్ఞశాలనుండి కొట్టి తరిమివేసెను. అప్పుడు పరుగెత్తుచుండిన కాశ్యపులకు మార్గవేయరాముడు తోడ్పడి శ్యాపర్ణిని వాగ్వివాదముననే జయించి కాశ్యపులకు సోమపానార్హతను కలిగించెనని పై బ్రాహ్మణము చెప్పుచున్నది.
ఈ కథయే భార్గవేయరాముని జయముగా బురాణములలో వృద్ధి కాబడెనేమో! (నాగరలిపిలో మ, భ అను నక్షరముల కంతగా భేదము లేనందున భార్గవను మార్గవగా చదివిరేమో)
వానరులగూర్చి విశేషచర్చను రెడ్డిగారు చేసియున్నారు. వానర, కిన్నర, కింపురుష శబ్దములు ఏకార్దబోధకములుగా కూచిమంచి తిమ్మకవి