పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54 రాధికాసాంత్వనము

క. ఇల రాయరాయ లగుమా
యలరాయల నెంచి యూచ కాచక మదిలో
నలరాయల నెలరాయల
వలరాయల నెన్న దృష్టిపాత్రలు గారే. 57

ఉ. ఆనడ లామెఱుంగుతొడ లారసికత్వము లావిలాస మా
మేనిమెఱుంగు లామొలకమీసఁపురంగులు నాబెడంగు లా
సూనశరాసతంత్రపరిశోధన లామధురస్మితంబు లా
పూనికచొప్పు లాపలుకుపోడిమి యానెఱజాణకే తగున్. 58

ఉ. మాటలు ముద్దుపద్దులును మక్కువ చెక్కులు మ్రొక్కుసొక్కులున్
గాటఁపుకౌఁగిలింతలు వగల్ గిలిగింతలమీటువింతలున్
మాటికి మాటికి న్గలయుమాలిమి మేలిమిఁ జూచినట్టియే
యాటది వాని వీడు నకటా కడురక్కసి నన్నుఁ దక్కఁగన్. 59

మ. అని చింతించుచు మించుఁబోఁడి తనకున్ బ్రాణావనోదార మై
వనజస్యందమరందబిందువిలసద్వాగ్ధోరణీసార మై
యనవద్యాఖిలలోకవర్ణితమనోజ్ఞాకార మౌకీరముం
గని తా ని ట్లనె [1]సూనసాయకశరాఘాతార్తచిత్తాబ్జ యై. 60

మ. ఇదిగో వచ్చెద నంచుఁ బోయె బహునాళ్లేగెన్ మహాబ్దంబు లై
సదయుం డేటికి రాడు నాయెడఁ గటాక్షం బెల్లఁ బో నా డెనో
మది దా వీడెనొ కూడెనో యిళను రామా జీవ మూటాడెడిన్
మదనక్రూరదవానలం బదన మై మై నంటఁగాఁ గీరమా. 61

ఉ. కంటికి నిద్ర రాదు విను కాంతుని బాసిననాఁటినుండియున్
వంటక మింపు గాదు పెరవార్తలు వీనుల సోఁక లేదు నేఁ
డొంటిగఁ బ్రొద్దు పోదు మరు లూరక యుండఁగ నీదు తొల్లియే
జంటఁ బెనంగువారి గనఁ జాలక చాల కరంగఁ గంటినో. 62

  1. రాధ మన్మథ [మూ.]