పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 53

గఱులు గా వవి మరువేటయురులు గాని
యురులు గా వవి శౌరిముంగురులు గాని. 54

సీ. ఈకప్పు పెన్నెరి కెన యౌనె సౌరముల్
నీలాంచలముపైని నెగడినంత
నీయెమ్మెక్రొమ్ముడి కెన యౌనె నునునాచు
యమునాజలంబులో నల్లినంత
నీనిడుకీల్జడ కెన యౌనె రాహువు
గురుతమోవిఖ్యాతిఁ గొన్న యంత
నీగొప్పకొప్పున కెన యౌనె శిఖికోటి
మనులతో బహుమైత్రిఁ గన్న యంత
తే. ననఁగ వలగట్టి మృదులత్వ మంది చిక్కు
గొనక భంగమై కొనసాగి కనుల కెసఁగి
బెండుపడకయె యెపు డొక్క దండి వన్నె
జెందు గోపాలకస్వామి చికురభరము. 55

సీ. శకటారి నెమ్మోము సరి యెందు లేదని
ద్విజరాజుపై నానఁ బెట్టవచ్చు
శౌరికన్నులతోడ సమ మెందు లేదని
తమ్ములఁ బడవైచి దాఁటవచ్చు
మరునికన్నయమోవి సరి యెందు లేదని
యమృతంబుముందర నాడవచ్చుఁ
గ్రీడిబావయురంబు జో డెందు లేదని
యాదిశేషునిఫణ మంటవచ్చు
తే. కంసరిపుమధ్యసామ్యంబు గలుగ దనుచుఁ
జెప్పి హరిముందరనె బాస సేయవచ్చుఁ
గృష్ణదేవునిరూప మిం కెందు దొరకఁ
బో దటంచును నజు నైన ముట్టవచ్చు.