పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

ఇట్లుండఁగా "వేలాంవెఱ్ఱి” అనుసామెతగాఁ జాలదినములనుండి తెలుఁగుబాసలోఁ గవిత్వము చెప్పవలయు నను కుతూహలము కూడఁ గలిగి పట్టుదలతో మరల భారతాదిగ నాంధ్రగ్రంథములు చదివితిని. పదపడి బ్రహ్మశ్రీ శతావధానులు తిరుపతి వేంకటేశ్వరకవులు విరచించిన శ్రవణానందము మొదలగు గ్రంథములు చదువుచుండఁగ వారి “పాణిగృహీత" యను ప్రబంధములోని

తే. రాధికాసాంత్వనమ్మును రచనఁ జేసి
పేరు గనుముద్దుపళని తెల్వియును విజయ
నగర భూపాలుఁ డుంచిననాతి చాటు
పద్యములు గాంచి యాకీర్తి పడయ నెంచి.

అను పద్యమును జూచి రాధికాసాంత్వనమును గడుఁగుతూహలముతోఁ గొని చదువఁగా నందు ముద్రాసమయమునఁ దటస్థించిన తప్పు లెన్నియో కన్పట్టినవి. అయ్యయో! ఇయ్యది మంచిప్రతి దొరకకపోయినదే యని విచారించుచుండఁగా దైవవశమున నామిత్రు లొకరు చాలకాలము క్రిందట వ్రాసిన వ్యాఖ్యానసహితమైన యొకవ్రాఁతప్రతిని నాకుఁ బంపించిరి. అదియు నచ్చుప్రతియు సరి చూడఁగాఁ జాలవ్యత్యాసము గనుపించినది. మంగళాచరణము మొదలు షష్ఠ్యంతములవఱకును గల పీఠిక లేకపోవుటయే కాక మధ్యమధ్యను గొన్నిపద్యములుకూడ లేవు. మఱికొన్ని చోట్ల పద్యములచరణములే విడువఁబడియున్నవి. ఇట్టి ముద్దుల మూటగట్టు రాధికా సాంత్వనమును రచించినది