పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 87

తే. ఎల్లవారికి శకునంబు లెల్లఁ బలికి
బల్లి తాఁ బోయి తొట్టిలోఁ బడినరీతి
నొకరి నననేల తాఁ జేసికొనినపనికి
వెనుకఁ జింతించు టెల్లను వెఱ్ఱితనము. 46

ఆ. హద్దుముద్దుమీఱి యాఁడుది మగఁ డంచుఁ
గూడి మాడి యాడఁ జూడఁ దలఁచి
బలిమి విందుఁ బెట్టి పగ గొన్నచందానఁ
బెండ్లి చేసి నేనె బేల నైతి. 47

ఆ. నక్క యురులలోనఁ జిక్కుకొన్నవితానఁ
గోరి మనము చేసికొన్నపనికి
బేగులోనితీఁటవిత మాయె ననఁగ రా
దత్తకొంగు తొలఁగినటులఁ జిలుక. 48

చ. కరి తరుమంగ వాఁడి గలకంటకము ల్వని మేనఁ గాడఁగా
సరి పడఁ బోవఁ బాము గని జాలిన మధ్యమసీమ నెల్క వే
కొఱికెడువేరు పట్టి చుఱుకుల్ తగఁ గందురుటీఁగ లెల్లెడం
గరువఁగఁ దేనెఁ గ్రోలఁ జనుకామినితో సరి యైతిఁ గీరమా. 49

తే. నీవు పోయినపనికి రానీవు కొదవ
పట్టి పల్లార్చి దేవకిపట్టినిటకు
దోడుకొని వత్తు వనుచు నీతోడు చిలుక
నెమ్మి కన నెమ్మనమ్మున నమ్మియుంటి. 50

తే. దాని వెలి చేసి శౌరి నెట్లైనఁ గాని
తోడి తెచ్చునుపాయంబు దోఁచ లేదొ
తోఁచ కాడితి నీ కేల తోఁచ నిచ్చు
ముందుపడ నాదుతలవ్రాత ముద్దుచిలుక. 51

వ. అనిన విని బెట్టులికి చిలుక యక్కిలికించితవతీతిలకంబుం దిలకించి యీబాల యింతబేల యగునే యని బెట్టునిట్టూర్పు నిగుడించి యిట్లనియె. 52